
మెదక్ చర్చి గ్రౌండ్స్‌లో బుధవారం జరిగిన ప్రగతి శంఖారావం సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మెదక్: ‘కోటి కుటుంబాలకు నల్లా నీళ్లు ఇస్తున్న, వ్యవసాయానికి.. పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇన్ని సౌకర్యాలను వదిలేసి రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించొద్దు. చేతగాని వారి చేతుల్లో పెట్టొద్దు..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోసగాళ్ల మాటలు నమ్మితే గోస పడతామని హెచ్చరించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో బంగాళఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతోందని, ఆనాడు రూ.200 పెన్షన్‌కే పరిమితమై ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామని చెబుతున్న ఆ పార్టీని నమ్మొద్దని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ అంటున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. అనంతరం మెదక్ చర్చి గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రగతి శంఖారావం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ధరణితో ఇబ్బందులు తొలగిపోయాయి..
‘వరి ధాన్యం పండించడంలో రాష్ట్రం పంజాబ్‌ను మించి పోయింది. రైస్ మిల్లులు చాలనంత ధాన్యం పండుతోంది. ధరణి వచ్చాకే వారి భూములపై రైతులకు సర్వహక్కులు దక్కాయి. ధరణి రాకముందు వీఆర్‌ఓ మొదలుకుని సీసీఎల్‌ఏ సెక్రటరీ వరకు అంతా వారి చేతుల్లోనే ఉండేది. రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. తమ పంటలను విక్రయించాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. సేట్లు.. బీట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ధాన్యం డబ్బుల కోసం వెళితే వారం తర్వాత రావాలని, నెల రోజుల తర్వాత రావాలనే సమాధానం ఎదురయ్యేది.
ధరణితో పరిస్థితి మారింది. రైతులు పండించిన ధాన్యమంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యమవుతోంది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. అదే ధరణి రద్దయితే కైలాసంలో పెద్ద పాము మింగినట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది..’ అని కేసీఆర్ హెచ్చరించారు.
ఆలస్యమైనా రుణమాఫీ చేశాం..
‘కరోనా, కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వంటి కారణాలతో ఆలస్యమైనప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.37 వేల కోట్ల రైతుల పంట రుణాలను మాఫీ చేశాం. రైతు బీమా పథకం అమెరికా, ఇంగ్లాండ్..ఇలా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా పరిహారం సొమ్ము బాధిత రైతు కుటుంబానికి చెందిన వారి ఖాతాలో జమ చేస్తున్నాం.
ఒక్క చాన్స్ ఇవ్వండని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీతో పాటు, టీడీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఘనపురం ఆనకట్టను పట్టించుకోలేదు. సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్‌కు పరిమితం చేసి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పంటలను ఎండ బెట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణలో మాదిరిగానే మహారాష్ట్రలో కూడా బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటామని ఆ రాష్ట్ర రైతులు అంటున్నారు..’ అని సీఎం తెలిపారు.
సర్కారును నడపడమంటే సంసారాన్ని నడిపినట్లే..
‘సర్కారును నడపడమంటే సంసారాన్ని నడిపినట్లే. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న మేరకు కళ్యాణలక్ష్మి, పెన్షన్ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళుతున్నాం. ప్రభుత్వ ఆదాయం పెరిగే కొద్దీ ఆయా సంక్షేమ పథకాల మొత్తాన్ని పెంచుతాం. అక్టోబర్‌లో వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభలో అన్ని నిర్ణయాలు ప్రకటిస్తాం. ఎన్నికలు వస్తే ఆగం కావద్దు. ధీరత్వాన్ని ప్రదర్శించాలి.
ఎవరు నిజమైన ప్రజా సేవకులో, వాస్తవం ఏంటో గుర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి..’ అని కేసీఆర్ అన్నారు. బహిరంగ సభలో మంత్రులు టి.హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్, రసమయి బాలకిషన్, భూపాల్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
రెండు కొత్త పథకాలు ప్రారంభం
మెదక్‌లో ముఖ్యమంత్రి రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పింఛన్లను లబి్ధదారులకు పంపిణీ చేశారు. అలాగే బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ వర్తింపును కూడా ప్రారంభించారు.
పది సీట్లు సీఎంకు కానుకగా ఇస్తాం: హరీశ్‌రావు
మెదక్: మెదక్ జిల్లాకు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేయలేని పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక మెదక్‌కు రైలు వచ్చిందని, ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు. కాళేశ్వరం ద్వారా మెదక్ జిల్లాకు నీళ్లు అందుతున్నాయని, మండుటెండలో సైతం మత్తడులు దుంకుతున్నాయని చెప్పారు.
నేడు దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడానికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు అబద్ధాలతో కాలం గడుపుతుంటే కేసీఆర్ మాత్రం అభివృద్ధితో దూసుకెళ్తున్నారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా అందిస్తామని హరీశ్ అన్నారు.
రెండు కొత్త పథకాలు ప్రారంభం
మెదక్‌లో ముఖ్యమంత్రి రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పింఛన్లను లబి్ధదారులకు పంపిణీ చేశారు. అలాగే బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ వర్తింపును కూడా ప్రారంభించారు.