
సాక్షి,హైదరాబాద్: ఏడాది చివర్లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీలో అసమ్మతిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంతర్గత అసమ్మతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదనే సంకేతాలివ్వాల ని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైతే కొందరిపై వేటు వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
హ్యాట్రిక్ విజయానికి ప్రధానంగాఅవరోధంగా భావిస్తున్న అంశాలపై ఇప్పటికే అంచనాకు వచ్చిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలను సైతం వేగవంతం చేయాలని నిర్ణయించారు. పార్టీలో సంస్థాగత లోపాలను సరిదిద్దడంపైనా దృష్టి సారించారు. అవసరమైన చోట బుజ్జగింపు చర్యలు చేపట్టే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు మంత్రులకు అప్పగించారు.అదే సమయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఆత్మీయ సమ్మేళనాల్లో బయటపడ్డ విభేదాలు..
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా పలుచోట్ల బీఆర్‌ఎస్ నేతల నడుమ విభేదాలు బయటపడ్డాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ల కోసం సిట్టింగ్‌లు, ఆశావహుల నడుమ తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో చాలాచోట్ల నేతలు ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉన్నారు.
అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వేముల వీరేశం (నకిరేకల్), కోటిరెడ్డి(నాగార్జునసాగర్), కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), తుమ్మల నాగేశ్వర్‌రావు (పాలేరు), శ్రీహరిరావు (నిర్మల్), పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు) తదితరులు ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉన్నారు.
ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనూ కొందరు అసమ్మతి నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరుపుతుండగా, తాజాగా నిర్మల్‌కు చెందిన కీలక నేత కూచాడి శ్రీహరిరావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే అవకాశముందని ఇప్పటికే కేసీఆర్ ఓ అంచనాకు వచ్చారు. వారి కదలికలపై ఇప్పటికే నిఘా వేసిన అధినేత.. బుజ్జగింపుల వంటి దిద్దుబాటు చర్యలకు, అవసరమైతే కొందరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికార పదవులు అనుభవిస్తూనే కొందరు, అవకాశాలు దక్కలేదని మరికొందరు అసమ్మతి గళం వినిపించడాన్ని కేసీఆర్ సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ నుంచి వచ్చిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నించడంపై అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఓడినా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశమిచ్చిన విషయాన్ని కేసీఆర్ పార్టీల నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇలాంటి నేతలను వదులుకోవడం ద్వారా పార్టీపై వ్యతిరేకతను ఉపేక్షించబోమనే గట్టి సంకేతాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్!
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నియోజకవర్గాల్లో వీలైనంత మేర పరిస్థితిని చక్కదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే లోతైన సమాచారంతో కూడిన నివేదికలు కేసీఆర్‌కు సర్వే, నిఘా సంస్థలు అందజేశాయి. గ్రామ, మండల స్థాయి వరకు పార్టీల వారీగా ప్రభావం చూపే నాయకులు, క్రియాశీల వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఈ నివేదికల్లో ఉన్నట్లు సమాచారం.
ఈ నివేదికల్లో బీఆర్‌ఎస్‌తో పాటు విపక్ష పార్టీల బలాబలాలకు సంబంధించిన అంచనాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతల వ్యవహార శైలికి సంబంధించిన అన్ని అంశాలను ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జిలు నివేదికలు అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని పార్టీ సమావేశాల్లో చెబుతూనే.. మరోవైపు పనితీరు మెరుగుపర్చుకోవాలని, ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం.
తద్వారా దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయం తప్పదని భావిస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్ కూడా అందరికీ టికెట్టు ఇస్తామని ఆరు నెలల ముందే ఎలా చెబుతామని ప్రశ్నించడం చూస్తుంటే.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయాన్ని కేసీఆర్ సిద్ధం చేశారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.