సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట.. జిల్లా కావడం ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తలసారి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. అభివృద్ధిలో ఇప్పటికే అత్యుత్తమ దశకు చేరుకున్నామన్నారు.
‘‘తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుంది. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభారతి నిర్మిస్తాం. జిల్లాలోని ప్రతి మున్సిపాల్టికి రూ.50 కోట్లు మంజూరు చేస్తాం. ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్ కూడా నిర్మిస్తాం. సూర్యాపేటపేట జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు మంజూరు చేస్తాం. కాంగ్రెస్, బీజేపీలకు 50 ఏళ్లు అవకాశం ఇచ్చారు.. ఈ 50 ఏళ్లలో ఆ పార్టీలు ఏం అభివృద్ధి చేశాయి. రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించిందా?’’ అని సీఎం ప్రశ్నించారు.
పెన్షన్ తప్పకుండా పెంచుతాం.. తర్వలోనే ప్రకటిస్తాం. ఇచ్చిన ఏ మాటా తప్పలేదు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పుష్కలంగా సాగునీళ్లు ఉన్నాయి. రైతులకు 3 గంటలే కరెంటు చాలని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటకలో కరెంటు కష్టాలు ఇప్పటికే మొదలయ్యాయి. ధరణి వ్యవస్థ తెచ్చాం.. వీఆర్‌వోలను తొలగించాం. వీఆర్‌వో వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భూముల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు తొలగిపోయాయి. ధరణితో రిజిస్ట్రేషన్ కష్టాలు తీరిపోయాయి’’ అని సీఎం పేర్కొన్నారు.
‘‘ధరణి వ్యవస్థను తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా అధికారం లేదు. పైరవీకారులకు మళ్లీ అధికారం రాకూడదు. కాంగ్రెస్ వాళ్ల ఆపద మొక్కులను ప్రజలు నమ్మొద్దు. మోసపోతే ఘోష పడతాం. ఎవరు ఎన్ని కథలు చెప్పిన విజయం బీఆర్‌ఎస్‌దే’’ అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment