సాక్షి, న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతోందని, అది కేసీఆర్‌కి నచ్చడం లేదని, అందుకే కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. కేసీఆర్ పదేళ్ల పాటు తన కుటుంబం బాగు కోసమే పని చేశాడు. తెలంగాణలో పంటల బీమాకు దిక్కు లేదు. రైతు రుణ మాఫీ చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారు. 24 గంటల ఉచిత కరెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం’’ అని ఠాక్రే వెల్లడించారు.
చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా!
‘‘తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థులకు కొదవలేదని, మాది కేసీఆర్‌లా కుటుంబ పార్టీ కాదు. రేవంత్, ఉత్తమ్, భట్టీ, మధు యాష్కీ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క లాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగా సీఎం ఎంపిక ఉంటుంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండదు’’ అని ఠాక్రే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment