సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. విపక్షాల విమర్శలను ఉపేక్షించకూడదని, విరుచుకుపడే విధానాన్ని అవలంబించాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ.. ఇరు పార్టీల విధానాలను, అనుసరిస్తున్న పంథాను ఎండగట్టాలని అభిప్రాయానికి వచ్చారు.
ఆ రెండు పార్టీలు బీఆర్‌ఎస్‌ను అనవసరంగా విమర్శిస్తూ, తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని.. ఇలాంటి సమయంలో ఎదురుదాడి చేయకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్నారని వివరిస్తున్నాయి.
‘ఏ టీం, బీ టీం’పై ఆగ్రహం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పరస్పరం తలపడాల్సిన కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేసీఆర్ సీరియస్‌గా పరిగణిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ‘ఏ టీం’, ‘బీ టీం’ అంటూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను నిలువరించకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.
బీజేపీలో జరుగుతున్న పరిణామాలను బీఆర్‌ఎస్‌ను జతచేస్తూ జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న బీఆర్‌ఎస్ ప్రభావాన్ని నిలువరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ తమను లక్ష్యంగా చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలను ఏకకాలంలో ఇరుకున పెట్టేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు.
పార్లమెంటు సమావేశాల్లో దూకుడుగా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అనేక అంశాల్లో కాంగ్రెస్, ఇతర విపక్షాలతో కలసి బీఆర్‌ఎస్ ఆందోళన చేసింది. మళ్లీ ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ బీఆర్‌ఎస్ గొంతు వినిపించేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. దీనికి సంబంధించి వచ్చే వారం బీఆర్‌ఎస్ ఎంపీలతో భేటీ నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో ఎత్తిచూపేలా తమ కార్యాచరణ ఉంటుందని పార్టీ ఎంపీ ఒకరు వెల్లడించారు.
విపక్షల్లోని అసంతృప్త నేతలకు గాలం..!
బీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు జాతీయ పార్టీల్లోని సంస్థాగత లోపాలను అనువుగా మలుచుకోవాలని.. అసంతృప్త, అసమ్మతి నేతలకు గాలం వేసి, పార్టీ చేర్చుకోవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఆదేశాల మేరకు కీలక నేతలు పలువురితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, భిక్షమయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి పల్లె రవికుమార్ బీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు.
ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఓ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన రాకను నిరసిస్తూ సంబంధిత నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కేడర్ సమావేశమై తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేశారు కూడా. గతంలో రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌లో చేరి, ఎంపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారిన నేత కూడా బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. సదరు నేతకు పెద్దపల్లి లోక్‌సభ స్థానం లేదా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తామనే హామీ బీఆర్‌ఎస్ నుంచి వచ్చినట్టు సమాచారం. ఇదే తరహాలో మరికొందరు నేతలపైనా బీఆర్‌ఎస్ ఫోకస్ చేసినట్టు తెలిసింది.
ప్రధాని మోదీ పర్యటనపై ఫోకస్
ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్‌కు రానున్న నేపథ్యంలో.. బీజేపీ, కేంద్రం తీరును ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. విభజన చట్టం హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలను లేవనెత్తనున్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల ద్వారా ప్రధానికి ప్రశ్నా్రస్తాలు సంధించనున్నారు. ప్రధాని పర్యటన ముందు, తర్వాత బీజేపీపై ఎదురుదాడిని తీవ్రం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment