సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితాను రెండు విడతల్లో విడుదల చేసేందుకు పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సన్నాహాలు చేస్తున్నారు. 86 నియోజకవర్గాల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. మంచిరోజు కావడంతో ఈ నెల 21న తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి.
తొలి విడతలో 90 నుంచి 105 మంది పేర్లతో జాబితా వెలువడే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా 15%మంది సిట్టింగ్‌లకు టికెట్ లభించే అవకాశం లేదని నిర్ధారణ కావడంతో వీరిలో కొందరు అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొందరు సిట్టింగ్‌లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు తదితరులను కలిసి ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.
వీరికి చాన్సున్నా కొనసాగుతున్న కసరత్తు
ఆర్మూర్, పెద్దపల్లి, హుజూరాబాద్, తాండూరు, నకిరేకల్, ఆసిఫాబాద్ సీట్లలో సిట్టింగులకే మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉన్నా.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరికపై సందిగ్ధత కొనసాగుతుండంతో సంగారెడ్డి అభ్యర్థి ఎంపిక కూడా కొలిక్కి రావాల్సి ఉంది.
► ములుగు, మధిర, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జహీరాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, జగిత్యాల, చొప్పదండి, రామగుండం, నర్సాపూర్, ముషీరాబాద్, అంబర్‌పేట, కల్వకుర్తి, నాగార్జునసాగర్, కోదాడ, ఇల్లందు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లపై తొలి జాబితాలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.
► సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత, ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పేర్లు సీఎం పరిశీలనలో ఉండటంతో కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి.
► మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుల పేర్లు ఖరారైనప్పటికీ వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
► కాంగ్రెస్, టీడీపీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తుండటం కూడా అభ్యర్థుల ఖరారు ప్రక్రియపై ప్రభావం చూపుతోంది.
కమ్యూనిస్టులతో పొత్తు తేలితే రెండో జాబితా
ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐతో బీఆర్‌ఎస్ ఎన్నికల పొత్తు కుదిరే సూచనలు ఉన్నాయి. అయి తే వారితో చర్చలకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో పాటు టికెట్ల కోసం నెలకొన్న తీవ్ర పోటీ, ఇతర పార్టీల నుంచి ఒకరిద్దరి చేరికలపై స్పష్టత వచ్చిన తర్వాత రెండో జాబితా విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. వేములవాడ, ఉప్పల్, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ లాంటి కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులుగా పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే మునుగోడు, భద్రాచలం స్థానాలను వదిలేయాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment