ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాని మండలికి ఎన్నికయ్యారు.. ఎస్టీ కోటాలో మంత్రి పదవి పొందారు. తనను మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌పై స్వామిభక్తి చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. చేతి మీద అధినేత పేరుతో పచ్చబొట్టు వేసుకుని సంబరపడుతున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా చెప్పులు వేసుకోవడంలేదు.
రాజకీయాల్లో పదవులు కాపాడుకోవడం, ఉనికి కాపాడుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పదవులు పొందడానికి, ఉన్న పదవిని కాపాడుకోవడానికి అధినేత మెప్పు పొందడానికి ఎన్ని బాధలైనా పడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహార సరళి గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి గులాబీ దళపతి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. గత 4 నెలలుగా పాదరక్షలు లేకుండా తిరుగుతున్న మంత్రి సత్యవతి రాథోడ్.. తాజాగా తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేసుకుని స్వామి భక్తిని మరో సారి చాటుకున్నారు. స్వామి భక్తిని చాటుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎవ్వరి అంచనాలకు అందకుండా తనను మంత్రిని చేసిన కేసీఆర్‌పై సత్యవతి రాథోడ్ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. శపథానికి కట్టుబడి నాలుగు మాసాలుగా చెప్పులు లేకుండా తిరగడంతో వేసవి ఎండల దృష్ట్యా అరికాళ్లకు బొబ్బలొచ్చి కంటతడి పెట్టారు. కేసీఆర్ పై ఉన్న అభిమానం ముందు కాళ్ల బొబ్బలు పెద్ద సమస్యే కాదని భావించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారా భవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకురాలైన మంత్రి సత్యవతి రాథోడ్ తన పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది.
కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోవడం మానేసిన విషయాన్ని అందరూ మర్చిపోవడంతో పచ్చబొట్టు వేసుకొని తన ప్రతిజ్ఞను గుర్తుచేయడంతో పాటు.. కేసీఆర్ పట్ల ఎంతో అభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పే ప్రయత్నమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. డోర్నకల్ లేదా మహబూబాబాద్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న సత్యవతి రాథోడ్ కేసీఆర్ కరుణ కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నారని టాక్ నడుస్తోంది.
చదవండి: జానారెడ్డి అసలు స్ట్రాటజీ ఇదేనా?.. సీఎం కుర్చీ కోసమేనా..?
నియోజకవర్గం లేకుండా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి, డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను కాదని సత్యవతికి టిక్కెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్‌లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ పై స్వామిభక్తిని చాటుకుంటే ఎక్కడో ఓ చోట అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది.
మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయంపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో నొచ్చుకున్నారట. ఏమి అడగకుండానే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకుంటే ప్రత్యర్థులు లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే పదవి బెటర్ కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి తన రాజకీయ జీవితాన్ని పటిష్టపర్చుకునేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment