గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న సీఎం కేసీఆర్ , గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో డీజీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ నేడు నిరంతర విద్యుత్తు వెలుగులు, పంట కాల్వలు, పచ్చని చేలతో కళకళలాడుతోంది. మండే ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతోంది. ఇరవైకి పైగా రిజర్వాయర్లతో తెలంగాణ పూర్ణకలశం వలె తొణికిసలాడుతోంది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోంది.
తెలంగాణ అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఈ పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని అందించాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
నాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు!
పదేళ్ల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ దుఖం తన్నుకొస్తుంది. ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరెంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నలు. అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు. ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు. యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు. ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు. ఇలాంటి అగమ్యగోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది.
నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి
ఒక దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని సూచికలుగా పరిగణిస్తారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1గా నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో తొలి స్థానంలో ఉంది. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. తొమ్మిదిన్నరేళ్లలో రూ.37 వేల కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా స్థిరీకరించింది. కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ వక్ర భాష్యాలు చెబుతున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలని వ్యాఖ్యానిస్తున్నారు. వీరికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నా.
సాగునీరు, వైద్యారోగ్య రంగంలో ప్రగతి
మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించినా కేసులు వీగిపోయాయి. పర్యావరణ అనుమతులు లభించాయి. స్వల్ప కాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి రాష్ట్రం చరిత్ర సృష్టించింది.
మరో 8 మెడికల్ కాలేజీలను త్వరలోనే ప్రారంభించి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నిమ్స్ విస్తరణ శరవేగంగా జరుగుతున్నాయి. అనాథ పిల్లలను ‘స్టేట్ చి్రల్డన్’గా గుర్తిస్తూ వారికోసం ప్రత్యేక పాలసీని ప్రభుత్వం రూపొందించింది.
విద్యారంగ వికాసం..ఐటీలో మేటి
వెయ్యికి పైగా గురుకుల జూనియర్ కళాశాలలు ప్రారంభించాం. మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి పేరుతో రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నాం. రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాం. టీఎస్ ఐపాస్ చట్టం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజం వచ్చింది. రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రా్రష్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. 17.21 లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు పెరిగాయి.
త్వరలో ‘తెలంగాణ చేనేత మగ్గం’
దళితబంధు కింద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం. ప్రభుత్వ లైసెన్సు వ్యాపారాల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు, బీసీల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీలకు రూ.లక్ష సాయం, ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంపు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు, మద్యం దుకాణాల్లో గౌడలకు 15శాతం రిజర్వేషన్లు, గీతన్న, నేతన్నలకు రూ.5 లక్షల బీమా, నేత కార్మికులకు నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
ఫ్రేమ్ మగ్గాల పంపిణీకి ‘తెలంగాణ చేనేత మగ్గం’అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నాం. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు, లబ్దిదారుల సంఖ్యను 29 లక్షల నుంచి 44 లక్షలకు పెంచాం. లబ్దిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించాం. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచాం.
33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం
33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోగా, ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందిన సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయి. వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలను పొందుతున్నారు.
త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతాం. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తాం. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి పండుగల బోనస్‌గా రూ.1,000 కోట్లు పంపిణీ చేయబోతున్నాం. వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులనూ క్రమబద్దీకరించాలని నిర్ణయించాం.
హైదరాబాద్‌లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు
తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. వారికి రైతుబంధు సాయం సైతం అందించింది. పోడు కేసుల నుంచి విముక్తులను చేసింది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి చేకూరనుంది.
ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాం. గత నెలలో భారీ వర్షాలు కురవడంతో తక్షణ సహాయంగా రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు మంగళవారం నుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నాం. నగరం నలువైపులకూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పేదరికం తగ్గుముఖం
సంపద పెంచు – ప్రజలకు పంచు అనే సదాశయంతో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందని, తలసరి ఆదాయం పెరుగుతోందని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచి స్పష్టం చేసింది. జాతీయ స్థాయి సగటుతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైంది. 2015–16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019–21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైంది.
లక్ష్యం చేరని స్వతంత్ర భారతం
75 ఏళ్ల స్వతంత్ర భారతం గణనీయ ప్రగతి సాధించినా, ఆశించిన లక్ష్యాలు, చేరవల్సిన గమ్యాలను ఇంకా చేరలేదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల్లో పేదరికం తొలగిపోలేదు. వనరుల సంపూర్ణ వినియోగంతో ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే స్వాతంత్య్రానికి సార్థకత.
అమర వీరులకు నివాళి
గోల్కొండ కోటలో జెండావిష్కరణకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మృతి చిహ్నాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఎయిర్ వైస్ మార్షల్ చంద్రశేఖర్, ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జీవోసీ మేజర్ జనరల్ రాకేష్ మనోచా ఇతర ఆర్మీ అధికారులు అమర సైనికులకు నివాళులర్పించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎంఓ కార్యాలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment