సోమవారం ప్రగతిభవన్‌లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు బృందంతో సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బోర్డు అధ్యక్షుడు సైఫుల్లా రెహ్మాని, హోం మంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతోందని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు.
విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహా రాలు, సంస్కృతులు కలిగి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని తేల్చిచెప్పారు.
అందులో భాగంగా యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది.
యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేసింది. దేశ ప్రజల అస్థిత్వానికి, వారి తరతరాల సాంప్రదాయ, సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా కేంద్ర ప్రభుత్వం మారిందని ఆరోపించింది. ఈ సమావేశంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, కె.తారకరామారావు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తాం...
‘కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా, బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతోంది.
అందుకే యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొనిపోతూ యూసీసీ బిల్లుపై పోరాడతామని చెప్పారు.
ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావుకు సూచించారు. కాగా దేశంలోని గంగా జమున తహజీబ్‌ను రక్షించేందుకు ముందుకు రావాలనే తమ అభ్యర్థనను అర్థం చేసుకుని ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు గాను సీఎం కేసీఆర్‌కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ధన్యవాదాలు తెలిపింది.
ఏపీ సీఎంకు కూడా విజ్ఞప్తి చేస్తాం: అసదుద్దీన్
ఉమ్మడి పౌర స్మృతి వస్తే అన్ని వర్గాలకూ నష్టం జరుగుతుందని మజ్లిస్ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలు, గిరిజనులతో పాటు హిందూవులకు కూడా మంచిది కాదని చెప్పారు. హిందూ వివాహ చట్టం రద్దు అవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని మోదీ లౌకికవాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కేంద్రం యూసీసీ బిల్లు తెస్తే వ్యతిరేకించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఏపీ సీఎంకు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment