
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను దాదాపు సిద్ధం చేసిన బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అదే సమయంలో సొంత పార్టీని చక్కదిద్దే చర్యలపైనా దృష్టి పెట్టారు. సిట్టింగ్‌లకు ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రజల్లో, స్థానిక పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత, ఆరోపణలున్నవారిని పక్కనపెడుతున్నారు. ఆయా చోట్ల సర్వేలు, నిఘా నివేదికల ఆధారంగా గెలవగలిగిన వారిని ఎంపిక చేస్తున్నారు.
ఈ క్రమంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహుల నుంచి ఎదురయ్యే అసమ్మతికి చెక్ పెట్టేదిశగా పావులు కదుపుతున్నారు. ఆయా నేతలు పార్టీని వీడినా, అంతర్గతంగా సహకరించకపోయినా నెలకొనే నష్టాన్ని అంచనా వేస్తూ.. దానికి విరుగుడుగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల వారిని ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం.
అసమ్మతి నేతలకే గెలుపు బాధ్యతలు
రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ టికెట్ కోసం గట్టిపోటీ ఉండగా.. అందులో కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు ఇతరులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్థుల జాబితా విడుదల చేశాక టికెట్ దక్కని నేతల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని అంచనా వేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే నేతల వివరాలను నిఘా సంస్థల ద్వారా సేకరిస్తున్నారు. టికెట్ ఆశించి, భంగపడిన నేతలను కూడా కలుపుకొనిపోవాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు బాధ్యతల్లో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు.
ప్రత్యేకంగా చేరికలతో..
మరోవైపు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సొంత పార్టీ నేతలు, విపక్షాల నాయకుల వివరాలను బీఆర్‌ఎస్ ఇప్పటికే సేకరించింది. అసమ్మతులతో పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. క్షేత్రస్థాయిలో బలం కలిగిన ఇతర పార్టీల నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే పని మొదలుపెట్టింది. గతంలో స్వతంత్ర అభ్యర్థులుగా లేదా ఇతర చిన్న పార్టీల నుంచి పోటీచేసి గణనీయంగా ఓట్లు సాధించిన నాయకుల డేటాపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే స్థానికంగా బలం కలిగిన కౌశిక్ హరి (రామగుండం), ఉప్పుల వెంకటేశ్ (కల్వకుర్తి) వంటి నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇలాంటి చేరికల ద్వారా అంతర్గత అసమ్మతికి చెక్ పడుతుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కని నేతలను కూడా చివరి నిమిషంలో బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా కూడా.. విపక్షాల ఎత్తుగడలను దెబ్బకొట్టవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నాయి.
ఇతర పార్టీల నుంచి చేరికలకు సంబంధించి జిల్లా మంత్రులు, నమ్మకస్తులైన నేతలకు కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ చేరికల ఆపరేషన్‌ను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు సమన్వయం చేస్తున్నారు.