సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టే దిశగా భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కార్యాచరణను వేగవంతం చేశారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తిచేసిన ఆయన.. ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా లిస్టును ప్రకటించనున్నట్టు తెలిసింది. సీఎం పెద్ద సంఖ్యలో అభ్యర్థులతో జంబో జాబితా ప్రకటించనున్నారని.. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ తొలి జాబితాలోనే కనీసం 80–90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశముందని బీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిస్తూ.. దుబ్బాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వంటి పలు స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి రెండో జాబితాను ప్రకటించడంతోపాటు వామపక్షాలతో పొత్తుపై తుది నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఇక కాంగ్రెస్‌కు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ నెల 17న లేదా 18న బీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని.. తొలి జాబితాలో ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ మరోమారు గజ్వేల్ నుంచే పోటీ చేయడం కూడా ఖాయమైనట్టు పేర్కొన్నాయి.
కేటీఆర్, హరీశ్‌లతో సుదీర్ఘ మంతనాలు
గత మూడు రోజులుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన కేసీఆర్.. అభ్యర్థుల ఎంపిక, పార్టీ ఎజెండా, మేనిఫెస్టో, ప్రచార వ్యూహం ఖరారు వంటి అంశాలపై లోతుగా కసరత్తు చేసినట్టు తెలిసింది. శనివారం యాదాద్రి జిల్లా పోచంపల్లి పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో సాయంత్రానికల్లా ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు.
వీరంతా శనివారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఇందులో అభ్యర్థుల ఎంపిక వంటి పార్టీ అంశాలతోపాటు రైతు రుణమాఫీ, బీసీ బంధు, ఉద్యోగుల పీఆర్సీ వంటి ప్రభుత్వపర అంశాలపైనా చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పాలన, పారీ్టపరమైన పలు అంశాలపై ఇద్దరు కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
19న మెదక్, 20న సూర్యాపేటకు కేసీఆర్
సీఎం కేసీఆర్ ఈనెల 19, 20 తేదీల్లో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. 19న శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. తర్వాత బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారు. 20న ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ ఆఫీసు, మెడికల్ కాలేజీ కొత్త భవనాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అక్కడ కూడా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
17 తర్వాత ఎప్పుడైనా.. బీఆర్‌ఎస్ జంబో లిస్ట్
Published Sun, Aug 13 2023 1:05 AM | Last Updated on Sun, Aug 13 2023 12:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment