
సాక్షి, హైదరాబాద్: ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా బీఆర్‌ఎస్ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగుస్తున్నాయి. దీంతో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములను చేస్తూ మరిన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై ఇప్పటికే కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు.
రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఈ నెలాఖరులో పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం, ప్రభుత్వ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసిన కేసీఆర్ ఎన్నికల సన్నద్ధతలో తదుపరి కార్యాచరణకు మరింత పదును పెడుతున్నట్లు సమాచారం.
యువజన, విద్యార్థి సమ్మేళనాలు
దశాబ్ది ఉత్సవాల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు యువత, విద్యార్థులతో మమేకమయ్యేలా మరో కార్యక్రమాన్ని కేసీఆర్ రూపొందించారు. నియోజకవర్గ స్థాయిలో యువత, విద్యార్థులతో పార్టీ పక్షాన ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్ ‘నిధులు, నీళ్లు, నియామకాలు’అంశంపై ఆయా వర్గాలను చేరుకునేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
జూలై నెలాఖరు వరకు ఉద్యోగ, ఉపాధి కల్పన, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలను యువత, విద్యార్థులతో నిర్వహించే సమ్మేళనాల్లో వివరిస్తారు. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న బీఆర్‌ఎస్, ఆలోగా పార్టీ యంత్రాంగం అనునిత్యం క్షేత్ర స్థాయిలో ఉండేలా కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment