CM KCR Says We Will Win Again In Upcoming Elections In Telangana, Details Inside - Sakshi
Sakshi News home page

Telangana: మళ్లీ వచ్చేది మేమే!

Published Tue, Jun 20 2023 3:05 AM | Last Updated on Tue, Jun 20 2023 10:37 AM

CM KCR Comments On BRS Victory Next Election - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేసి.. నాలుగైదు మాసాల్లోనే రిజర్వాయర్లను నీటితో నింపుతామని ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాలకు కాళేశ్వరం జలాలను తరలిస్తామని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు అర్బన్‌ఫారెస్ట్‌లో సీఎం కేసీఆర్‌ హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘కాళేశ్వరంతోపాటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా పూర్తి కావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్‌ వాళ్లు అడ్డు తగిలి కోర్టుల్లో కేసులు వేసి పనులు ఆగేలా చేశారు. ఎన్నో అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పనులు కొనసాగించి ఇప్పటికే 85 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. నాలుగైదు మాసాల్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్లను నీటితో నింపుతాం. కాళేశ్వరం జలాలపై ఎలాంటి వివాదాలూ లేవు. కృష్ణా జలాలపై వివాదం కొనసాగుతోంది. 

రంగారెడ్డిని సస్యశ్యామలం చేస్తాం.. 
రంగారెడ్డి జిల్లా దాసర్లపల్లిలో నాకుగతంలో పదిపదిహేను ఎకరాలు ఉండేది. 20 బోర్లు వేయాల్సి వచ్చింది. సన్నగా పోసే బోర్లతో అనేక కష్టాలు పడ్డాం. ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం తెలంగాణలో ఈ బాధలన్నీ తీరిపోయాయి. ఓ చిన్న లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్, పరిగి సహా చేవెళ్ల, మహేశ్వరం, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం. కొండపోచమ్మ కింది నుంచి ఘట్‌కేసర్‌ మీదుగా కాళేశ్వరం నీళ్లను మూసి దాటించి లోయపల్లి రిజర్వాయర్‌ను నింపడం ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. 

వారి నోళ్లు మూతపడ్డాయి 
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు చాలా మంది హేళన చేశారు. తెలంగాణ వారికి పంటలు పండించడం రాదన్నారు. కరెంట్‌ లేక చీకట్లో మగ్గుతామన్నారు. ప్రస్తుతం దేశంలోనే ధాన్యం దిగుబడిలో, తలసారి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. మొక్కలను నాటి చెట్లను పెంచడంలో ముందుంది. 100 శాతం ఓడీఎఫ్‌ సాధించడంలోనూ ముందున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ టాప్‌లో నిలిచింది. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. 

హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయి 
నేను హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు హేళన చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంపై జోకులు వేసి నవ్వుకున్నారు. కానీ హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్లకు కడుతున్నాయి. రాష్ట్రంలో 22 శాతం ఉన్న పచ్చదనం 30శాతం దాటింది. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఇప్పటికే 267 కోట్ల మొక్కలు నాటాం. ఇప్పటికే 170 అర్బన్‌ ఫారెస్ట్‌లను పూర్తి చేసుకున్నాం.

ఇది మనందరి విజయం. హరితహారంలో భాగంగా ఈ ఏడాది పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందుకు రూ.100 కోట్ల బడ్జెట్‌ పెట్టాల్సిందిగా ముఖ్య కార్యదర్శికి సూచించాం. హరితహారం చట్టం తెచ్చినప్పుడు సర్పంచులు నాపై కోపం తెచ్చుకున్నారు. అయినా కష్టపడి పనిచేశారు. ఫలితంగా మోడువారిన దారులన్నీ నేడు పూల తేరులయ్యాయి. గ్రామాలు పచ్చబడిన కీర్తి సర్పంచులకే దక్కుతుంది. 

ఫారెస్ట్‌ అధికారుల కోసం 20 పోలీస్‌ స్టేషన్లు 
అటవీ రక్షణలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌ఆర్‌ఓ బండి శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం ఇస్తున్నాం. మనిషినైతే తేలేం కానీ కొన్ని డబ్బులు ఇచ్చాం. 500 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చి ఆదుకున్నాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫారెస్ట్‌ ఆఫీసర్లకు సాయుధ సాయం అందజేయాలని నిర్ణయించాం. అటవీ అధికారుల భద్రత కోసం తెలంగాణవ్యాప్తంగా 20 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అటవీ ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. 

నాలుగు మున్సిపాలిటీలకు రూ.150 కోట్లు 
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు మహేశ్వరంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం. జల్‌పల్లి, తుక్కుగూడ, మీర్‌పేట్, బడంగ్‌పేట్‌ మున్సిపాలిటీలకు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాం..’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement