తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సీట్లు రాని కొందరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలం మాకు సీటివ్వరా అంటూ రోదిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీట్లకు రెండు రకాల ట్రీట్‌మెంట్స్ ఇచ్చారు గులాబీ దళపతి. ఒక సీటును సిటింగ్‌ను కాదని ఎమ్మెల్సీతో భర్తీ చేశారు. మరో సీటును సిటింగ్‌కు ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. సీట్లు రాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విలపించడంతో వారి అనుచరులు కూడా కంటతడి పెడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను అయోమయానికి గురిచేస్తుంది. రాజకీయంగా నాటకీయ పరిణామాలకు దారి తీస్తోంది. జనగామ, స్టేషన్ ఘనపూర్ టికెట్లు అక్కడి ఎమ్మెల్యేలను కన్నీరు మున్నీరుగా విలపించే పరిస్థితి తీసుకొచ్చాయి. అందరూ ఉహించినట్లుగానే స్టేషన్ ఘనపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు.
స్వయం కృతాపరాధంతో టికెట్ కోల్పోయిన రాజయ్య భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. జరిగిన పరిణామాలను తలుచుకుంటూ కార్యకర్తలను పట్టుకుని బోరున విలపిస్తున్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారంతో పశ్చాత్తాపం చెందుతున్నారు.
టికెట్ రాకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. కొందరు పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మాత్రం అధినేతను కలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. కెసిఆర్ గీసిన గీతను దాటనని, తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెబుతున్నారు. తనకు కేసిఆర్ ఆశీస్సులున్నందున.. ఆందోళన చెందకుండా అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నారు. డాక్టరయిన తనకు స్థాయికి తగ్గ స్థానం కేసీఆర్ కల్పిస్తారనే నమ్మకం ఉందంటున్నారు.
చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ఇక జనగామ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టికెట్ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెరపైకి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్లు రావడంతో పల్లా వద్దు.. ముత్తిరెడ్డే ముద్దు అంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగి కన్నీటి పర్యంతమయ్యారు. మా బాపుకు అన్యాయం చెయ్యొద్దు అంటు ముత్తిరెడ్డిని పట్టుకుని బోరున విలపించారు. కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించడంతో ముత్తిరెడ్డి సైతం కన్నీటి పర్యంతమై ఒక్క అవకాశం ఇవ్వండని రెండు చేతులు జోడించి దండం పెడుతూ కేసీఆర్‌ను వేడుకున్నారు.
ప్రజాసేవకు అంకితమైన అధికారం పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెక్కి వెక్కి ఏడ్వడం ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా కలకలం రేపింది. మరి ఎమ్మెల్యేల కన్నీరు గులాబీ దళపతిని కరిగిస్తుందా? వారి అనుచరుల ఆవేదన ఫలితాన్నిస్తుందా? కొద్ది రోజుల తర్వాత గాని ఏ విషయం తెలిసే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment