నదిలో ఈత ఒడ్డున ఆట
అల్లం రాజయ్య... తెలుగు సాహిత్యంలో తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిన రచయిత రాత... చేత ఒక్కటై నడుస్తున్న వ్యక్తి! సామాజికార్థిక అంశాలే ఆయన కథలకు నేపథ్యాలు! ఈ చైతన్య స్రవంతి గోదావరితో తన జ్ఞాపకాలను పంచుకున్నారిలా...
నేను పుట్టింది మంథని (కరీంనగర్ జిల్లా)దగ్గరున్న గాజులపల్లిలో. గోదావరి మా ఊరికి ఆరు కిలోమీటర్లు. మా ప్రాంతంలో శివభక్తులు ఎక్కువ. ప్రతి శివరాత్రికి దాదాపు వంద గ్రామాలవాళ్లు గోదావరికి వచ్చేవాళ్లు స్నానాల కోసం. మా చిన్నప్పుడు అదో అద్భుతమైన జ్ఞాపకం. తెల్లవారు జామున నాలుగు గంటలకే లేచి కచ్చడాలు కట్టుకొని అందరం గోదావరికి వేళ్లేవాళ్లం. ఎడ్లబళ్లు వరుసగా బారులు తీరి వెళ్తుంటే భలేగుండేది. హోలీ పండుగకైతే మా ఆటలన్నీ గోదావరితోనే. హైస్కూల్ వరకు మంథనిలో చదివాను. మంథనికి గోదావరి కిలోమీటరే. టైమ్ దొరికితే చాలు పిల్లలమంతా కలసి గోదావరికి వెళ్లేవాళ్లం. నదిలో ఈతలు... నది ఒడ్డున ఆటలు.
ఊహ తెలిశాక...
గోదావరితో పరిచయం వేరు. అది నేర్పే పాఠాలు వేరు. ఊహ తెలిశాక గోదావరి ఎన్నో పాఠాలు నేర్పడం మొదలు పెట్టింది. చుట్టూ అంత పెద్ద ప్రవాహం ఉన్నా పంటలకు చుక్క నీరందని పరిస్థితి..? ఎందుకు? అన్న ఆలోచన వచ్చింది. ప్రశ్నించడం స్టార్ట్ చేసి పోరాటం చేసే స్థాయికి వెళ్లాం. ‘మా నీళ్లు మాకెందుకివ్వరు’ అన్నది చాలా జన్యూన్ కాజ్! సమస్యను పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణచివేశారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం రైతుసంఘాలు పెట్టాం.
సాహిత్య వేదికగా ప్రజాఉద్యమాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న విప్లవ రచయిత అల్లం రాజయ్య. ఆయన ప్రతి రచనా చైతన్య స్ఫూర్తే! అతడు, మహదేవుని కల, మనిషిలోపలి విధ్వంసం వంటి వంద కథలు, కొలిమంటుకుంది, ఊరు, అగ్నికణం, వసంతగీతం, కొమురం భీం వంటి నవలలూ రాశారు.
గోదావరి పేరుతో...
1975లో ఉద్యోగ నిమిత్తం గోదావరి అవతలి నుంచి ఇవతలికి వచ్చాను. అంటే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాను. అక్కడున్నప్పుడే ‘గోదావరి’ కలం పేరుతో పొయెట్రీ రాశాను. కథలు రాశాను. కథల్లోను గోదావరి ఉండేది. ఆ మాటకొస్తే తెలంగాణ గోదావరి... వేల ఏళ్ల కిందటే అద్భుతమైన సాహిత్యాన్నిచ్చింది. అన్వేషణను నేర్పింది. అసలు ఈ రోజు దేశంలో ఎలాంటి ఉత్పత్తి సంబంధాలు ఉండాలి? మనుషులు ఎలా బతకాలి అనేది నేర్పింది.
ఇన్నింటినిచ్చిన మా గోదావరి ఏం ఆశించింది? ఏమీ ఆశించలేదు. తాగ్యం నేర్పింది. జల్... జంగల్... జమీన్ అనే నినాదమైంది మాకు. మా గుండెల్లో పరుగులెత్తుతున్న గోదావరి అదే!
సంభాషణ: సరస్వతి రమ
గోదావరి తీరాన... పలుకుబడులు... వ్యవహారాలు!
గోదావరి ప్రాంతంలోని సామెతలకు ఎంతో జనాదరణ ఉంది. గ్రామీణ జనం ఎక్కువగా వీటిని వాడుతుంటారు. ఇక్కడి జన వ్యవహారంలో, వ్యావహారిక భాషలో కలిసిపోయిన అనేక సామెతలలో కొన్ని.
ఏదారంటే... గోదారన్నట్లు
అంబటేరు వచ్చింది అత్తా అంటే... కొలబుర్ర నా చేతిలో ఉంది కోడలా... అన్నదట
లంక మేత... గోదారి ఈత
కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లు
చొల్లంగి తీర్థానికి చోడిగింజలు
బల్లకట్టు దాటాక బోడిమల్లయ్య అన్నట్లు
ఏట్లో వేసినా ఎంచి వేయాలన్నట్లు
పుస్తెల తాడు అమ్మి అయినా పులసలు తినాల్సిందే
కొత్తనీటికి చేపలెదురెక్కినట్లు
కాకినాడ కాజా, ఆత్రేయపురం తాండ్ర మజా
పుణ్యానికని గోదారి స్నానానికెళితే మొసలి ఎత్తుకెళ్లిందట
గోదాట్లో నీరెంత ఉన్నా కడవైతే కడివెడే, గరిటైతే గరిటెడే...
ఏతాం పాటకు ఎదురు పాట లేదన్నట్లు
ఏదారీ లేకపోతే గోదారే...
గోదారమ్మొచ్చి గోరంత దీపం పెట్టిందన్నమాట...
గోదారెండితే, రైతుల కడుపుమండినట్లేమరి...
గోదారి నిమ్మనంగా... జనం చల్లంగా...
గోదారి తల్లి పక్కనే ఉంటే ఉక్కపోతా తక్కువే...