
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సందర్భంగా విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన, అత్యుత్తమ సేవలందించిన పలువురు అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పురస్కారాలను అందజేశారు. వారి వివరాలు..
► ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న పాఠశాల విద్యార్థులను అదే జిల్లాకు చెందిన ఎస్జీటీ పాయం వీనయ్య రక్షించారు.
► జనగామ జిల్లాకు చెందిన విద్యుత్ లైన్‌మెన్ ఎం.డి.రెహ్మాన్ వరదల్లో సైతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ధైర్య సాహసాలతో విధులు నిర్వహించారు.
► ములుగు జిల్లాకు చెందిన పంచాయతీ సెక్రటరీ సంజీవ్‌రావు ముత్యాలధార జలపాతంలో చిక్కుకున్న 80 మంది యాత్రికులను రక్షించడంలో గొప్ప సమన్వయం కనబరిచారు.
► ములుగు జిల్లా జెడ్పీ సీఈఓ ప్రసన్నరాణి కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న గర్భిణులను క్షేమంగా తరలించడంతో పాటు, వాయుమార్గం ద్వారా చేపట్టిన ఆహార పంపిణీని జాగ్రత్తగా పర్యవేక్షించారు.
► భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆర్.ఎ.ఎస్.పి. లత వరదల్లో చిక్కుకున్న పలు గ్రామాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
► భూపాలపల్లి జిల్లా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి.ప్రదీప్ కుమార్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు బోట్లు, హెలికాప్టర్ సేవలను సమర్థంగా వినియోగించి 100 మందికి పైగా ప్రజలను రక్షించి, వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అడిషనల్ కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి, రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల పంచాయతీ అధికారి ముత్యాలరావు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు. రక్షణ, పునరావాస చర్యలను సమర్థంగా నిర్వహించారు.
► భూపాలపల్లి జిల్లాలో సీఐ రామనరసింహారెడ్డి వరదల్లో చిక్కుకున్న ప్రజల తరలింపు, తప్పిపోయిన నలుగురు వ్యక్తులను రక్షించడంతో పాటు, మరో మూడు మృతదేహాలను గుర్తించారు.
► భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పీఎస్ ఎస్‌ఐ నరేశ్ మానేరు నది వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు.
► వరంగల్ జిల్లా మటా్వడ పీఎస్ ఏఎస్‌ఐ కె.సంపత్ తన బృందంతో వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 880 మంది ప్రజలను రక్షించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
► ములుగు జిల్లాలో ఏఎస్‌ఐ జి.రాంబాబు మేడారంలో వరదల్లో చిక్కుకున్న 19 మందిని తన బృందంతో కలిసి రక్షించారు.
► ములుగు జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కె.శ్రీకాంత్ తన టీమ్‌తో కలిసి మేడారం వరదల్లో చిక్కుకున్న 19 మందిని రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
► రాష్ట్ర సచివాలయంలో జీఏడీ శాఖలోని ఎన్‌ఆర్‌ఐ సెక్షన్‌లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏడిగ చిట్టిబాబు ఉక్రెయిన్, సూడాన్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యా ర్థులను స్వరాష్ట్రానికి తరలించడంలో చురుకైన పాత్రను పోషించారు. కొన్నేళ్లుగా వేర్వేరు దేశా ల్లో ప్రాణాలు కోల్పోయిన 1,200 మంది వ్యక్తు ల మృతదేహాలను తెలంగాణకు తరలించడంలో ఆయా దేశాల ఎంబసీలు, కాన్సులేట్ అధికారులు, హైకమిషనర్లతో సమన్వయం, సంప్రదింపులు జరిపి, కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడంలో కీలక పాత్రను పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment