సాక్షి, నల్గొండ: సగం నెల పూర్తయినా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన కోమటిరెడ్డి.. ఇప్పటికైనా జీతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే రెండు నెలలన్న ఒకటికే జీతాలు ఇవ్వాలంటూ లేఖలో సూచించారు.
జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఓపీఎస్‌ను అమలు చేస్తామని లేఖలో పేర్కొన్నారు.
చదవండి: లొల్లి చేస్తే దవడ పగలగొడతా: రేణుకా చౌదరి
బుధవారం ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. బానిస బతకుల పార్టీ బీఆర్‌ఎస్‌దే. కనీసం అపాయింట్‌మెంట్ అడిగినా తనకు ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు.
‘‘కేసీఆర్ లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. కాళేశ్వరం కాంట్రాక్టర్లు, భూ కబ్జాకోరులు బీఆర్ఎస్‌కు కావాలి. ఉద్యోగులకు ఒకటినే జీతాలు ఇవ్వాలి. ఏడాది కాలంగా పదమూడు, పద్నాలుగునా జీతాలు ఇస్తున్నారు. డిఫాల్టర్లుగా మారడంతో భవిష్యత్తులో లోన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు ఇవ్వకపోడంతో ఉద్యోగులు శాపనార్ధాలు పెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు అమ్ముడుపోయారు. కేటీఆర్ చేతగాని దద్దమ్మ. పింఛన్లు ఇవ్వలేని వాళ్లు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దోచుకున్న సొమ్మంతా రాబోయే రోజుల్లో బయట పడుతుంది. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తాం’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
‘‘రేపటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. నల్లగొండను దత్తత తీసుకుంటున్నామని అన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయలేదు.దత్తత తీసుకుంటే ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు.
‘‘ఎస్సెల్బీసీ సొరంగం ఎందుకు పూర్తి చేయలేదు. గజ్వేల్, సిద్దిపేటలో వేల ఇళ్లు నిర్మించారు. నల్లగొండలో ఒక్క ఇళ్లు కూడా ఎందుకు నిర్మించలేదు. రోడ్డు కోసం ఇళ్లు కూలగొట్టి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాత్రం కట్టుకున్నారు. దత్తత పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్‌కు డిపాజిట్ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. కాంగ్రెస్ అధికారంలోకి రాగామే స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తాం’’ అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment