ప్రగతిభవన్‌లో అఖిలేశ్‌తో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఏ ఇతర పార్టీకి ఏ టీమో, బీ టీమో కాదని.. భారత్‌లో గుణాత్మక మార్పు కోసం సొంతంగా జాతీయ స్థాయిలో ఎదిగేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీ మినహా ఇతర భావసారూప్య పార్టీలను కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
సోమవారం రాష్ట్రానికి వచ్చిన యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాల గురించి సుమారు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.
పట్నా సమావేశం వివరాలపై..
అఖిలేశ్ యాదవ్ గత నెల 23న బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్‌కు వివరించారని తెలిసింది. బీఆర్‌ఎస్ సహా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని తాము బలంగా కోరుకుంటున్నామని చెప్పారని.. పట్నా భేటీలో పలువురు నేతలు ఈ విషయాన్ని నొక్కి చెప్పారని వివరించినట్టు సమాచారం.
బీఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తే పట్నా సభకు తాము హాజరుకాబోమని తేల్చి చెప్పామంటూ ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. దీనితో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానాల వల్లే బీజేపీ రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. రాహుల్ గాంధీ పరిణతి లేని వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ మరింత పలుచన అవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
యూపీలో సమాజ్‌వాదీ చీలికకు కుట్ర!
మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎన్సీపీని చీల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు కేసీఆర్, అఖిలేశ్ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. మహారాష్ట్ర తరహాలో యూపీలో సమాజ్‌వాదీ పార్టీని చీల్చి, విపక్షాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అఖిలేశ్ పేర్కొన్నట్టు సమాచారం. దీనితో గతంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించగా, తాము అడ్డుకున్నామని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది.
జాతీయ స్థాయికి బీఆర్‌ఎస్..
ఇక ఈ నెల మూడో వారంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగే విపక్షాల భేటీ అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘బీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పటికే మహారాష్ట్రలో అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. నాగ్‌పూర్ నుంచి షోలాపూర్ దాకా బీఆర్‌ఎస్ నిర్వహించిన సభలకు మంచి స్పందన వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోనూ మా పార్టీ కార్యాచరణ ప్రారంభమైంది. త్వరలోఅక్కడ పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒడిశాలో మాజీ సీఎం కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్లమెంటు ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతుంది. ఆ దిశగా మేం సాగిస్తున్న ప్రస్థానంలో కలసి వచ్చే భావసారూప్య శక్తులను కలుపుకొనిపోతాం’’ అని అఖిలేశ్‌కు కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
అఖిలేశ్‌కు ఘన స్వాగతం...వీడ్కోలు
యూపీలోని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్ యాదవ్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.
తర్వాత జరిగిన లంచ్ భేటీలో కేసీఆర్, అఖిలేశ్‌లతోపాటు మంత్రులు వేముల, తలసాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎస్.వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. భేటీ తర్వాత సాయంత్రం 5.15కు అఖిలేశ్ తిరిగి ప్రత్యేక విమానంలో బయలుదేరగా.. విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్సీ వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment