=‘ప్రత్యేక’ పరిస్థితుల్లో పడిపోయిన హోటళ్ల వ్యాపారం
=భారీగా తగ్గిన ఆదాయం
=మూతపడుతున్న చిన్న హోటళ్లు
=విక్రయానికి సిద్ధంగా మరికొన్ని..
సాక్షి, సిటీబ్యూరో: ‘అతిథి దేవోభవ’ అంటూ సాదరంగా స్వాగతం పలికే భాగ్యనగరి ఇప్పుడు అతిథులు లేక వెలవెలబోతోంది. ‘నిత్య కల్యాణం పచ్చ తోరణం’ అన్నట్లు ప్రతి రోజు సభలు, సదస్సులు, సమావేశాలు, పర్యాటకులతో కిటకిటలాడే బహుళ నక్షత్ర హోటళ్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల దృష్ట్యా ఆతిథ్యరంగం సంక్షోభంలో చిక్కుకుంది.
గత కొంతకాలంగా ఐటీ, పర్యాటకం, సేవా రంగాలలో అభివృద్ధి నిలిచిపోవడం, పెట్టుబడుల ప్రవాహం ఆగిపోవడం, అభివృద్ధి, విస్తరణ పథకాలు ఎక్కడికక్కడే స్తంభించిపోవడం తదితర కారణాల రీత్యా ఐదు నక్షత్రాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, రెస్టారెంట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. హోటళ్లలో పది శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదని పలువురు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది కాలంలో జరిగిన చాలా మార్పులు హోటళ్ల రంగాన్ని నిర్వీర్యం చేశాయని హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో నిత్యావసర సరకుల ధరలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది. ఉప్పులు, పప్పులు, బియ్యం, వంటనూనె, ఉల్లిగడ్డలు వంటి నిత్యావసర సరకుల ధరలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. దీనికి తోడు సరకుల రవాణాకు అవసరమైన ఇంధన వనరుల ధరలు కూడా పెరిగాయి. వీటన్నిటి భారం తమపైనే పడుతోందంటున్నారు హోటల్ నిర్వాహకులు.
ఇదిలా ఉంటే రెండు నెలలకు పైగా సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల గుండా హైదరాబాద్‌కు రావాల్సిన నిత్యావసర సరకుల వాహనాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇదే అదునుగా పలువురు వ్యాపారులు అరకొరగా సరకులను రవాణా చేసి ధరలను అమాంతం పెంచేశారు. రూపాయి విలువ తగ్గిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సముద్రపు ఉత్పత్తులు, మద్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి.
అమాంతం పెరిగిన ధరల భారాన్ని మోస్తూ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లను నిర్వహణ సాగిద్దామంటే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లే దని గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్ నిర్వాహకుడు చెప్పారు. విద్య, వైద్యం, నిత్యావసర ధరలు పెరగడంతో నగరవాసులకు ఇంటి నిర్వహణ భారంగా మారిపోయిందని, వారాంతాల్లో రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం చాలా వరకు తగ్గించారన్నారు. తమ హోటల్‌లో నెల రోజులుగా రూమ్స్ బుకింగ్స్ నిలిచిపోయాయని పేర్కొన్నారు.
పడిపోయిన ఆదాయం
మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని హోటళ్లలో లాడ్జింగ్ వ్యాపారం 60 శాతంగా ఉండేదని, ప్రస్తుతం 10 శాతానికి పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అడ్వైజర్ నాగరాజు ‘సాక్షి’తో చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లలో రోజుకు సుమారు రూ. 50 కోట్ల వ్యాపారం జరుగుతుండేది. కానీ నెల రోజులుగా రూ. 30 కోట్లకు మించడం లేదని అసోసియేషన్ గణాంకాల్లో తేలిందని చెప్పారు. 60 శాతంగా ఉండే రెస్టారెంట్ల టర్నోవర్ కాస్త 30 నుంచి 40 శాతానికి పడిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
స్టార్ హోటళ్ల నిర్వహణకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ కూడా కట్టలేని స్థితిలో హోటళ్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ కృష్ణయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సేల్స్, సర్వీస్, ప్రాపర్టీ, లగ్జరీ పన్నుల పేరిట నెలకు 20 నుంచి 25 శాతం పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారన్నారు. అయితే ఆ మేరకు ప్రభుత్వం నుంచి సేవలు అందటం లేదన్నారు.
దెబ్బ మీద దెబ్బ..
స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం ఎక్కువ శాతం విదేశీయుల రాకపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటిది హైదరాబాద్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా నగరానికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తదితర కారణాల వల్ల దాదాపు మూడేళ్లపాటు హైదరాబాద్‌కు విదేశీ పర్యాటకులు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ సమావేశాలు సైతం పెద్దగా జరగకపోవడంతో స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు బోసిపోయాయి.
ఏడాదికాలంగా ప్రశాంత వాతావరణం నెలకొని కాస్త కోలుకుంటున్న ఆతిథ్య రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ గడ్డుపరిస్థితుల్లోకి నెట్టేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలమని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా సీమాం ధ్ర ప్రాంతాల్లో ఉద్యమం మొదలైంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినటైంది. ఇలా ఐదేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా ఆతిథ్యరంగం తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. కొన్ని హోటళ్లయితే ఏకంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కారణాలు..
=రాష్ట్రంలో అనిశ్చితి వల్ల అన్ని రకాల వ్యాపారాల్లో మాంద్యం నెలకొంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
=అంతర్జాతీయ, జాతీయ స్థాయి సమావేశాలు, సదస్సులు జరగకపోవటంతో అతిథుల సంఖ్య పడిపోయింది.
=తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రుల ఉద్యమంతో వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారి సంఖ్య బాగా తగ్గింది.
పరిష్కారాలివీ..
=ప్రభుత్వం రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితిని తొలగించి ప్రశాంత వాతావారణం నెలకొల్పాలి.
=వెంటనే పన్నులు చెల్లించాలని హోటల్ , రెస్టారెంట్లపై ఒత్తిడి తేవొద్దు.
=కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమావేశాలు, సదస్సులను నగరంలోనే నిర్వహించాలి.
=పర్యాటక, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలి.
=‘గ్రేటర్’లో టూరిస్ట్ స్పాట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించాలి.
=జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వందకు పైగా ఆహార తనిఖీ అధికారులను నియమించాలి.
=ఆయా అధికారులు ప్రతిరోజు హోటళ్లు, రెస్టారెంట్లను విధిగా తనిఖీ చేయాలి.
=అన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ లెసైన్సులు తీసుకునేలా చేయాలి.
=హోటళ్లు, రెస్టారెంట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల భారాన్ని తగ్గించాలి.
నష్టాల్లో కూరుకుపోతున్నాం
వ్యాపారం సరిగా లేక నష్టాల్లో కూరుకుపోతున్నాం. పన్నులు, వడ్డీల భారాన్ని భరిస్తూ హోటల్‌ను నడిపించలేకపోతున్నాం. చిన్నాచితక హోటళ్లు అయితే మూతపడుతున్నాయి. కొన్ని హోటళ్లు అయితే అమ్మేసేందుకు సిద్ధంగా ఉన్నామని అసోసియేషన్ సమావేశాల్లో చాలా మంది హోటల్ నిర్వాహకులు చె ప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆతిథ్య రంగం కనుమరుగవుతుంది.
- జీవీ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
ఉద్యమాల ప్రభావం అతిథ్య రంగంపై పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ర్టంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలి. ఆందోళనలను అదుపుచేసి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులను కాపాడాలి. పరిస్థితులు చక్కబడ్డాక పన్నులు చెల్లిస్తాం. అదేపనిగా హోటల్ నిర్వాహకులపై ఒత్తిడి తీసుకురావొద్దు.
- నాగరాజు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అడ్వైజర్
‘ఆతిధ్యం’ తగ్గింది
Published Tue, Dec 3 2013 4:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement