వెరైటీ పబ్లిసిటీ
- పెరిగిన ప్రచార జోరు
- రూటు మార్చిన నేతలు
- విచిత్ర వేషాలు
- విభిన్నమైన పనులు
- {పచారం కొత్త పుంతలు
- తెరచాటు మంతనాలు
సాక్షి, సిటీబ్యూరో: సభలు.. సమావేశాలు.. పాదయాత్రలు.. బస్తీ పర్యటనలు.. గ్రూప్ మీటింగ్‌లు.. ఇదంతా రొటీన్ ప్రచార శైలి. దోశలు పోయడం.. దరువేయడం.. వాహనాలు నడపడం.. వెల్డింగ్ చేయ డం.. పాదాలకు మొక్కడం.. పిల్లల్ని ఆడించడం.. ఆనక ఫొటోలకు పోజులివ్వడం.. ఇది లేటెస్ట్ పబ్లి‘సిటీ’ స్టంట్. విచిత్రమైన పనిచేస్తే మీడియాలో ప్రచారం వస్తుందనే అంచనాతో అభ్యర్థులు హేర్‌కటింగ్‌ల నుంచి మొదలు పెడితే పాలు పితకడం దాకా ఏ పని పడితే ఆ పని చేసేస్తున్నారు. వెరసి కోటి విద్యలు ఓటు కోసమే.. అన్న చందాన నేతల ప్రచారం విచిత్ర రీతిలో, విభిన్న తరహాలో సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రచారానికి ఇక మిగిలింది నాలుగైదు రోజులే..! ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అభ్యర్థులు.. విభిన్న పద్దతులను అనుసరిస్తున్నారు. ఉన్న కొద్ది సమయాన్నీ అనుకూలంగా మలచుకునేందుకు.. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఉదయాన్నే లేచింది మొదలు పాదయాత్రలు, బస్తీపర్యటనలు కొనసాగిస్తున్న నేతలు.. మధ్యాహ్న భోజన విరామ సమయంలో బస్తీ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, ఇతరత్రా గ్రూపులతో చర్చలు కొనసాగిస్తున్నారు.
తమకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నారు. ఎండ తగ్గుముఖం పట్టాక మళ్లీ సాయంత్రం నుంచి బస్తీ పర్యటనలతో ప్రచారం చేస్తున్నారు. రాత్రివేళల్లోనూ లోపాయికారీ చర్చలు జరుపుతున్నారు. ఆయా కులసంఘాలను ఆకట్టుకునేందుకు వారికి హామీల జల్లులు కురిపిస్తున్నారు. బస్తీల్లోని వారికి కమ్యూనిటీహాళ్లు వంటి వాగ్దానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. వందల సంఖ్యలో ఓట్లు వేయించగల వారితో బేరసారాలు జరుపుతున్నారు. అందుకుగాను బస్తీల్లో పలుకుబడి గలవారిని, కులసంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమకు మద్దతిస్తే ఆర్థిక ప్రయోజనాలే కాక, గెలిచాక చేయగలిగినవన్నీ చేస్తామని చెబుతున్నారు.
వివిధ వర్గాలు లక్ష్యంగా..
యువకులు, విద్యావంతులను లక్ష్యంగా చేసుకొన్న నేతలు.. వారితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. కరపత్రాల ద్వారా పార్టీ విధానాలను వివరిస్తున్నారు. తమకు మద్దతివ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులనూ తమకు అనుకూలంగా మలచుకునేందుకు వారితో బేరం సాగిస్తున్నారు. తమకు మద్దతిస్తే, భవిష్యత్తులో రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు.
మహిళా సంఘాలను, స్వయంసహాయక బృందాలను దారిలోకి తెచ్చుకుంటే కుప్పలు తెప్పలుగా ఓట్లు పడతాయనే అంచనాతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నవారూ ఉన్నారు. రుణాలు, తదిర వరాలను వారికి ఎరగా వేస్తున్నారు. గ్రూపుకింత అని ముట్టజెప్పేందుకూ సిద్ధమవుతున్నారు. కులవృత్తుల వారికి అవసరమైన వనరులు, సదుపాయాలు కల్పిస్తామని కొందరు చెబుతుండగా, పేదలకు ఇళ్లిచ్చే పూచీ తమదని మరికొందరు వాగ్దానాలు చేస్తున్నారు. ఇలా.. ఎన్ని విధాల వీలైతే అన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నారు. రాత్రి రెండు మూడు గంటల వరకు వివిధ వర్గాల వారితో సమావేశమవుతున్నారు. కేవలం మూడుగంటల నిద్రతోనే రోజులు వెళ్లదీస్తున్న వారూ ఉన్నారు.
విధానాలతోనూ..
ఇక ఆయా పార్టీల అభ్యర్థులు తమ విధానాల్ని చెబుతూ ఓట్లడుగుతున్నారు. మాట ఇస్తే తప్పమని కొందరు.. తమకు ఓటు వేస్తేనే బంగారు భవిష్యత్తని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను తమ బుట్టలో వేసుకునేందుకు వివిధ రకాల ప్రచారాలు సాగిస్తున్నారు. చైతన్యరథాలపై కొందరు ప్రచారం నిర్వహిస్తుండగా, వాహనాలు, మైకుల ద్వారా ప్రచారాలు సాగిస్తున్నవారూ ఉన్నారు. జీపు ర్యాలీలు, బైకు ర్యాలీలతో హడావుడి బాగానే జరుగుతోంది. దీంతో, బస్తీలు, కాలనీలతోపాటు ప్రధాన మార్గాల్లోనూ ఎన్నికల నినాదాలు హోరెత్తిపోతున్నాయి.
ప్రచారంలో కొత్త పుంతలు
బండీపై బజ్జీలు వేస్తూ.. కొబ్బరి బొండాలు కొడుతూ.. కూరగాయలు అమ్ముతూ.. బోరు కొడుతూ.. చిన్న పిల్లలను లాలిస్తూ .. ఇంకా.. ఇంకా విచిత్ర పనులతో ఫోజులిస్తూ నేతలు పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారానైనా ప్రచారం వస్తే చాలుననుకుంటున్నారు. ‘సహస్ర వృత్తుల.. సమస్త ఫోజుల’ అన్నట్లుగా ఓటు కోసం నానా పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులతోపాటు సతులు, సుతులు, కుటుంబ సభ్యులు రంగంలోకి దిగిపోతున్నారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు వీలైనన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బొట్టుపెట్టి సెంటిమెంటు ఒలకబోసేవారు కొందరైతే.. బొట్టుబిళ్లలు, గిఫ్ట్‌లిచ్చి ఆక ర్షించేవారు మరికొందరు.. ఇలా ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు తమ వారిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ఇది పైకి కనిపించే తంతు కాగా, వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ఎక్కడికక్కడ నిలువుగా, అడ్డంగా విభజించి జరుగుతున్న సంప్రదింపులకూ కొదవేం లేదు.