న్యూఢిల్లీ: భారత్–ఇటలీ మధ్య భిన్న రంగాల్లో వాణిజ్య అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఇటలీ ఆర్థికాభివృద్ధి ఉప మంత్రి మైఖేల్ గెరాసి పేర్కొన్నారు. డీఎస్‌టీ– సీఐఐ ఆధ్వర్యంలో జరిగే భారత్ ఇటలీ టెక్నాలజీ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు భారీ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
రెండు దేశాల మధ్య భవిష్యత్తు ఆర్థిక, ద్వైపాక్షిక సహకారానికి ఈ రంగాలన్నీ మూలస్తంభాలుగా నిలుస్తాయన్నారు. మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఆర్థిక ప్రోత్సాహకాల పెంపు, న్యాయ వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేసే దిశగా తమ ప్రభుత్వం ఓ విధానాన్ని తీసుకురానున్నట్టు చెప్పారు. ‘‘స్టార్టప్ కంపెనీల కోసం ఓ కార్యకమ్రాన్ని తీసుకురానున్నాం. ఇందులో భాగంగా కొన్ని దేశాలను ఎంపిక చేసుకుంటున్నాం. ఇందులోకి భారత్‌ను కూడా తీసుకోవాలన్నది మా ఆలోచన. స్థిరమైన ఆర్థిక వృద్ధితో, మరింత అభివృద్ధి చెందే అవకాశాలు భారత్‌కు ఉన్నాయి’’ అని గెరాసి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment