
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారిలోనూ సూపర్ లగ్జరీ కార్లకు ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలీ లంబోర్గినీ భారత్‌లో అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. 2021లో 69 కార్లను విక్రయించింది. 2020తో పోలిస్తే ఇది 86 శాతం అధికం. భారత్‌లో లంబోర్గినీ కార్ల ధర రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2019లో దేశంలో 52 లంబోర్గినీ కార్లు రోడ్డెక్కాయి. 52 మార్కెట్లలో 173 డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 8,405 యూనిట్లను విక్రయించింది. సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో ఇదే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ది. తొలి స్థానంలో ఉన్న యూఎస్‌లో 2,472 యూనిట్లు అమ్ముడయ్యాయి. చైనా, జర్మనీ, యూకే, ఇటలీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.