ఇటలీని దాటేసిన భారత్‌ | India sixth place in the world amid covid-19 | Sakshi
Sakshi News home page

ఇటలీని దాటేసిన భారత్‌

Published Sun, Jun 7 2020 4:09 AM | Last Updated on Sun, Jun 7 2020 8:08 AM

India sixth place in the world amid covid-19 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ప్రపంచ దేశాల్లో ఇటలీని దాటి ఆరో స్థానానికి చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా మన దేశంలో బయటపడ్డాక ఒకే రోజు దాదాపుగా 10 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇటలీని దాటేసిన భారత్‌ ప్రపంచ పట్టికలో ఆరోస్థానానికి చేరింది. కొత్తగా 9,887 కేసులు నమోదు కావడంతో శనివారం నాటికి కేసుల సంఖ్య 2,36,657కి చేరుకుంది. ఇటలీలో ఇప్పటి వరకు 2,34,801 కేసులు నమోదయ్యాయి.  

70% మృతులకు వేర్వేరు వ్యాధులు
ఒకే రోజు 294 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 6,642కి చేరుకుంది. రికవరీ రేటు పెరగడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 48.20% మంది కోవిడ్‌ రోగులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణించిన వారిలో 70శాతానికి మందికిపైగా ఇతర వ్యాధులతో బాధుపడుతున్నవారే ఉన్నారని తెలిపింది. రకరకాల వ్యాధులు ఉన్న వారు కరోనాబారినపడి∙ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది.  

అయిదుగురు ఈడీ అధికారులకు కోవిడ్‌
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఉద్యోగులు అయిదుగురికి కరోనా వైరస్‌ సోకింది. వారిలో స్పెషల్‌ డైరెక్టర్‌ ర్యాంకు అధికారి ఉన్నారు. దీంతో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. సోమవారం వరకు ఆఫీస్‌ను మూసేస్తారు.

భారత్‌లో సామూహిక వ్యాప్తి దశ
భారత్‌ సరైన్‌ సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఇప్పటివరకు కరోనాని బాగా నియంత్రించిందని డబ్ల్యూహెచ్‌ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దేశాన్ని అన్‌లాక్‌ చేసే క్రమంలో కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ దశలో కేసులు మూడు వారాల్లోనే రెట్టింపు అవుతాయని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీస్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటిక్‌ డైరెక్టర్‌ మైకేల్‌ రయాన్‌ అంచనా వేశారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో నమోదవుతున్న కేసుల్ని చూస్తే దానిని విజృంభణగా భావించలేమన్నారు. ఇప్పుడు మార్కెట్ల తాళాలు తెరుస్తూ ఉండడంతో విస్తృతంగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

లాక్‌డౌన్‌ వంటి చర్యలతో వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్నప్పటికీ భారీగా వలసలు, నగరాల్లో అత్యధిక జనసాంద్రత, రోజూ పని చేస్తే తప్ప ఎందరికో పూట గడవని దుస్థితి వంటి అంశాలు వైరస్‌ నియంత్రణకు సవాళ్లుగా మారతాయని రయాన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడే భారత్‌ సామూహిక వ్యాప్తి దశకు చేరుకుంటోందని, మితి మీరి కేసులు నమోదవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా ప్రభావం భారత్‌లో ప్రాంతానికి ప్రాంతానికి మధ్య మారిపోతోందని వైరస్‌ వ్యాప్తి చెందడంలో పట్టణాలు, పల్లెల మధ్య చాలా వ్యత్యాసం ఉందని రయాన్‌ వివరించారు.

సెప్టెంబర్‌ నాటికి అంతం!
కరోనా వైరస్‌ భారత్‌లో సెప్టెంబర్‌ రెండో వారం నాటికల్లా అంతమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు డాక్టర్‌ అనిల్‌కుమార్, డాక్టర్‌ రూపాలీ రాయ్‌ చెబుతున్నారు. గణిత నమూనా ఆధారంగా చేసిన ఓ విశ్లేషణను బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు. ఎపిడిమోలజీ ఇంటర్నేషనల్‌ అనే ఆన్‌లైన్‌ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు. ఈ విశ్లేషణ కోసం వారు బెయిలీ గణిత నమూనాను ఉపయోగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement