సాక్షి, హైదరాబాద్ : కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు.. ఇది మనకు తెలిసిన నానుడి. కరోనా చావులకూ అంతకుమించిన కారణాలు ఉన్నాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే కరోనా వైరస్ సోకడమే కాదు.. ఆ సోకిన వారు వయసు మీదపడిన వారై ఉండాలి. వారికి అప్పటికే ఇతర రోగాలు ఉండాలి. అప్పుడే చనిపోయే అవకాశాలెక్కువ. ఇది చూచాయగా చెబుతున్న మాట కాదు. ప్రపంచ దేశాల పరిశోధనలో వెల్లడైన వాస్తవం.
మన దేశంలోనే కాదు..ఈ వైరస్ పుట్టిందని భావిస్తున్న చైనా, ఎక్కువమంది ఈ వైరస్ బారిన పడుతున్న అమెరికా, ప్రపంచంలోనే వృద్ధులు ఎక్కువ ఉన్న ఇటలీతో పాటు స్పెయిన్ తదితర దేశాల్లో ఇప్పటివరకు సంభవించిన మరణాలు, జరిపిన పరిశోధనలు తేల్చిందిదే. రోగ నిరోధక శక్తి లేని వృద్ధులను.. వారికి గతంలోనే ఉన్న క్యాన్సర్, గుండెజబ్బులు, బీపీ, షుగర్ వంటివి కలిసి కరోనా పేరుతో ప్రాణాలు తీస్తున్నాయి.
చైనాలో ఇలా: చైనాలో కరోనా మరణాలను విశ్లేషిస్తే.. వయోధికులే ఎక్కువగా చనిపోయారని తేలింది. ఈ దేశంలో కరోనాతో చనిపోయిన వారిలో 21.9శాతం మంది 80ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్నవారే. చైనీస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అధ్యయనం ప్రకారం 70కన్నా ఎక్కువ వయసున్న వారు 22.8శాతం చనిపోయారు. వీరిలో 10.5శాతం మందికి గుండె జబ్బులు, 7.3శాతం మందికి షుగర్, 6.3శాతం మందికి శ్వాస సమస్యలు, 6శాతం మందికి బీపీ, 5.6శాతం మందికి క్యాన్సర్ ఉన్నాయి.
ఇటలీ పరిస్థితి ఇది..
ఇటలీ విషయానికి వస్తే.. ఇక్కడ కరోనాతో చనిపోతున్న వారి సగటు వయసు 78.5. ఈ దేశంలో చనిపోయిన వారిలో అతి తక్కువ వయసు 31 కాగా, అతి ఎక్కువ వయసు 103 అని ఇటాలియన్ నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఇక్కడ చనిపోయిన 15,887 మందిలో 80–89 మధ్య వయస్కులు 41శాతం కాగా, 70–79 మధ్య వయసున్న వారు 35శాతం మంది. పైగా, ప్రపంచంలో వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇటలీది రెండో స్థానం. అందుకే ప్రపంచంలో కరోనా మరణాల రేటు ఇక్కడ ఎక్కువుంది.
ఈ దేశంలో జరిపిన మరో పరిశోధన ప్రకారం కరోనాతో పాటు ఇతర రోగాలు కూడా కలిసి ఇక్కడి ప్రజలను కబళిస్తున్నాయి. ఇక్కడ వైరస్ సోకిన 481 మందిపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపితే వారికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయని తేలింది. ఈ 481 మందిలో 48.6శాతం మందికి కరోనాకు తోడు మరో 3 ఇతర జబ్బులున్నాయి. వీరిలో బీపీ (73.8), షుగర్ (34), గుండె జబ్బులు (30.1) శాతం మేర ఉన్నట్టు నిర్ధారణైంది.
మన దేశంలో ఏం జరుగుతోంది?
వైద్య,ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మన దేశంలో కరోనా కారణంగా చనిపోతున్న వారిలో 60శాతం మందికి పైగా 60ఏళ్లు దాటిన వారే. వీరికి కరోనాకు తోడు ఆస్తమా, షుగర్, గుండె జబ్బులున్నట్టు తేలింది. కానీ ఈ వైరస్ సోకుతున్న వారిలో ఎక్కువ మంది 21–40ఏళ్ల వయసు ఉన్నవారే. ఆ తర్వాత 41–60ఏళ్ల వయసున్న వారు 33శాతం ఉండగా, 17శాతం మంది 60ఏళ్లు దాటిన వారు. ఈ 60ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువ మంది చనిపోతున్నారు.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్చి 10తర్వాతే పెరిగింది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 22వరకు ఈ వైరస్ సోకడంతో పాటు చనిపోతున్న వారి లెక్క రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా 7వేల మందిని కరోనా వైరస్ బలిగొన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇద్దరు జర్మనీ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం భారతదేశంలో చనిపోతున్న వారిలో 9ఏళ్లలోపు వయసున్న వారు 0.0016 కాగా, 80ఏళ్లు పైబడిన వారు 7.8శాతం ఉన్నారు.
ఐదుగురు మినహా
మన రాష్ట్రం విషయానికొస్తే.. ఇప్పటివరకు చనిపోయిన వారిలో ఐదుగురు మాత్రమే గతంలో ఎలాంటి జబ్బులు లేనివారని సమాచారం. మిగిలిన వారందరికీ గుండె జబ్బులు, కిడ్నీల సమస్య, క్యాన్సర్‌లాంటి చరిత్ర ఉంది. కరోనా సోకి చనిపోయిన 31ఏళ్ల వయస్కుడికి క్యాన్సర్ 3వ దశలో ఉందని తెలుస్తోంది. అంటే ప్రపంచ పరిశీలనలకు దగ్గరలోనే మన రాష్ట్ర పరిస్థితి కూడా ఉందని వైద్యులు అంటున్నారు.
వయోధికుల్లో ఏం జరుగుతుంది?
చిన్న, మధ్య వయస్కులతో పోలిస్తే పెద్ద వయసు వారిలో రోగ నిరోధకశక్తి తక్కువ ఉంటుంది. రోగ కారకాలపై పోరాడే శక్తి క్షీణిస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీనికి తోడు కరోనాలాంటి వైరస్ విరుచుకుపడితే వారిలో ఆ శక్తి మరింత తగ్గిపోతుంది. అంతేకాక సైటోకిన్ స్టార్మ్ అనే సిండ్రోం వయోధికులను ఎక్కువ ఇబ్బంది పాల్జేస్తుంది. ఈ సిండ్రోం కారణంగా రోగ నిరోధక కణాలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తయి వైరస్ ఉన్న స్థావరాలపై ఒక్కసారిగా దాడికి దిగుతాయి.
దీంతో ఆ వైరస్ ఉన్న శరీర భాగం పూర్తిగా దెబ్బతింటుంది. ఉదాహరణకు వైరస్ ఊపిరితిత్తులపై ఉంటే జ్వరం ఎక్కువవుతుంది. మంట పుడుతుంది. కొన్ని శరీర భాగాలు కూడా చెడిపోతాయి. వీటన్నింటికి తోడు వారికి క్యాన్సర్, షుగర్, గుండె, శ్వాససంబంధ సమస్యలుంటే ఏకంగా మరణానికి దారితీస్తుంది. ఇదే విషయాన్ని ఇండియాతో పాటు చైనా, ఇటలీ దేశాల్లో వైరస్ సోకిన వృద్ధులపై జరిపిన పరిశోధనలు బలపరుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment