కరోనా అలియాస్ కోవిడ్ 19.. చైనాలో బయటపడిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తోంది.మొదటి మూల్యాన్ని చైనా దేశమే చెల్లించుకుంది. ఇప్పుడు ఇతర దేశాలు కరోనా ప్రభావానికి గురవుతున్నాయి. ప్రపంచయుద్ధాల సమయంలో దేశాలు ఎంత అప్రమత్తంగా ఉంటాయో.. ఇప్పుడు కోవిడ్ వైరస్ విషయంలోనూ అంతే అప్రమత్తత పాటిస్తున్నాయి. ముందస్తుగా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కొన్ని దేశాల్లో కోవిడ్ వైరస్ శక్తి పుంజుకుంటోందన్నది నిపుణుల మాట. అందుకే చైనాతో మొదలై ఇటలీ, ఇరాన్, స్పెయిన్, సౌత్ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నార్వే, జర్మనీ లాంటి దేశాలతో సహా మొత్తంగా 170కుపైగా దేశాలు ఈ వైరస్‌కు చిక్కాయి. మరోవైపు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న పుకార్లతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇతర దేశాలు కాస్త ఆలస్యంగా చర్యలు చేపట్టినా.. చైనాకు పక్కలోనే ఉండే మన దేశం ముందునుంచీ అప్రమత్తంగానే ఉంటోంది. ముందస్తుగా చైనాలో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తీసుకొచ్చింది. ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా ఇండియాకు తీసుకొస్తోంది. అనేక రక్షణ చర్యలు చేపట్టింది. నేడు జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి ముందస్తుగా అనేక చర్యలు చేపట్టింది.
చైనా ఏం చేసింది?
- ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి.. చాప కింద నీరులా అన్ని ప్రాంతాలను చుట్టేసింది.
- దీన్ని గుర్తించిన చైనా వెంటనే తమ దేశంలోని నగరాల మధ్య రాకపోకలు నిలిపివేసింది.
- అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రజలు బయట తిరగకుండా కట్టడి చేసింది.
- పూర్తిస్థాయిలో పరీక్షలు చేసిన అనంతరమే ఇతర దేశాల ప్రజలను పంపించింది
- అప్పటికప్పుడు ఐసోలేషన్ వార్డులతో కూడిన ఆస్పత్రులను నిర్మించింది.
- కోటి మందికిపైగా జనం ఉన్న నగరం మొత్తాన్ని, ప్రతి ఇంటినీ, ప్రతి వీధిని ఖాళీ చేయించి అతిపెద్ద పరికరాలతో శుభ్రం చేసింది.
- భారీ డ్రోన్లను, ప్రత్యేక విమానాలను సైతం ఉపయోగించింది.
- రోజుకు రెండు సార్లు ఇలాంటి కార్యక్రమాలు చేసింది.
- వైరస్ సోకిన అనుమానితులను ఒక చోట, నిర్ధారణ అయిన వారిని మరోచోట పెట్టి వైద్యం అందించింది.
- చనిపోయిన వారికి ప్రత్యేక పద్ధతుల్లో దహన సంస్కారాలు నిర్వహించింది.
- వైరస్ నిరోధం విషయంలో అత్యంత కఠిన చర్యలను తీసుకొంది. ప్రజలు కూడా సహకరించారు.
- అందువల్లే గత మూడు రోజులుగా ఆ దేశంలో కొత్త కేసులేవీ సంభవించలేదు. ఒక రకంగా చెప్పాలంటే చైనా దేశం వైరస్‌పై పాక్షిక విజయం సాధించినట్లే.
ఇటలీలో ఏం చేస్తున్నారు?
- చైనా తర్వాత, అంతకు మించి అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న దేశం ఇటలీ.
- చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా మొదలైన ఈ వైరస్ ప్రభావం ఈ దేశాల్లో రోజురోజుకూ పెరుగుతోంది.
- కోవిడ్ బాధితుణ్ణి గుర్తించడంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా ఆ వ్యాధి విపరీతంగా విస్తరిస్తోంది
- రోజుకు వందలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు.
- దీంతో ఇటలీ జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించి.. ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.
- ఇటలీలో ఆర్థిక రాజధాని మిలాన్‌తో సహా దాదాపు 10 నగరాల్లో ప్రజల్ని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు.
- పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఎక్కడికక్కడ రోడ్లను మూసివేశారు. జనసంచారాన్ని పూర్తిగా నిరోధించారు.
- అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బయట తిరిగే వారిని జైలుకు పంపిస్తున్నారు.
- ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
భారత్‌లో పరిస్థితి ఏంటి?
- ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ రెండో దశలో ఉంది.
- ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ సోకింది.
- ప్రస్తుతం 22 రాష్ట్రాలకు విస్తరించింది. నలుగురు మరణించారు.
- మొత్తంగా ఇప్పటివరకు 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
- ఇప్పుడిప్పుడే వారి ద్వారా ఇతరులకు సంక్రమిస్తోంది.
- దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. షాపింగ్ మాళ్లు, స్కూళ్లు, పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని అన్ని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు.
- దేశంలోని అన్ని ఐటీ కంపెనీలు, ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
- వ్యాధిని నిరోధించే లక్ష్యంలో ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఏపీలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నాడు.
- మొత్తం 142 మంది అనుమానితులకు పరీక్షలు చేయించగా.. 130 మందికి కోవిడ్ లేదని తేలింది.
- కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరిలోనే రూ. 408 కోట్లను విడుదల చేసింది.
- దేశంలో ఎక్కడా లేని విధంగా.. విదేశాల నుంచి వచ్చిన వారిని ఎప్పటికప్పుడు వలంటీర్ల ద్వారా గుర్తిస్తున్నారు.
- వలంటీర్ల వ్యవస్థ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వారి ఇళ్లకు వెళ్లి మరీ పరీక్షలు చేయించగలిగింది.
- విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో వైద్య బృందాలను అందుబాటులో పెట్టారు.
- కోవిడ్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
- ముందు జాగ్రత్త చర్యగా 449 ఆస్పత్రుల్లో 900 ప్రత్యేక పడకలు, 445 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు.
- రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, మసీదులు, చర్చిలను మూసివేయించారు.
- అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో 240 క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
- అత్యవసర సేవలకు ర్యాపిడ్ యాక్షన్ బృందాలు ఏర్పాటు.
- ఢిల్లీలోని ఏపీ భవన్‌లో, తాడేపల్లిలోని ఏపీ ఎస్‌ఆర్‌టీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
- రక్తనమూనాలను ఇతర రాష్ట్రాలకు పంపాల్సిన అవసరం లేకుండా తిరుపతి, విజయవాడ, కాకినాడలో ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.
- జిల్లా స్థాయిలో కలెక్టర్ కన్వీనర్‌గా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌లు, ఎస్‌ఈలు, ఆర్‌ఎంలు, జిల్లా పంచాయతీ అధికారులుఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. వీరు ప్రతి రోజూ సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు.
జనతా కర్ఫ్యూ ఉద్దేశం ఏంటి?
- ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తంగా 14 గంటల మేర జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ సూచించారు.
- కోవిడ్ వైరస్ పబ్లిక్ ప్రాంతాల్లో 12 గంటలు జీవించి ఉంటుంది. ఆ తర్వాత చనిపోతుంది. అందువల్ల 14 గంటలు ప్రజలు బయట ఎవరూ తిరగకపోతే ఆ వైరస్ విస్తృతి లింక్‌ను చేధించడం సాధ్యం అవుతుంది. తద్వారా వైరస్ ఉధృతిని సగానికి సగం తగ్గించొచ్చు. ఆ ఉద్దేశంతోనే జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునిచ్చారు.
- అన్ని రాష్ట్రాలు జనతా కర్ఫ్యూ పాటించడానికి సన్నాహాలు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment