హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సేవా పన్నులను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంపై (వీసీఈఎస్) పన్నుల విభాగం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాలు ఉన్నాయని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ బి.బి. ప్రసాద్ తెలిపారు.
ఈ ఏడాది మేలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పట్నుంచి హైదరాబాద్ జోన్‌లో ఇప్పటిదాకా 100 దాకా దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా వచ్చే సేవా పన్ను మొత్తం సుమారు రూ. 30 కోట్లు ఉండగలదని ఆయన వివరించారు. డిసెంబర్ ఆఖరు దాకా ఈ పథకానికి గడువు ఉన్నందున అప్పటికి వీసీఈఎస్ ద్వారా రూ. 200-300 కోట్ల దాకా వసూలు కావొచ్చని పేర్కొన్నారు. వీసీఈఎస్‌పై పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ సోమవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొన్నారు.
మరోవైపు, ఈ పథకాన్ని వ్యాపార వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సభ్యురాలు (బడ్జెట్ విభాగం) షీలా సాంగ్వాన్ తెలిపారు. వీసీఈఎస్ గడువును మరింత పొడిగించడం గానీ, దీనికి సవరణలు చేయడంగానీ ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. 2013-14లో వసూలయ్యే మొత్తం సేవా పన్నులో వీసీఈఎస్ ద్వారా వచ్చే వాటా సుమారు 10 శాతంగా ఉంటందని అంచనాలు ఉన్నట్లు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర తెలిపారు.
సేవా పన్ను పథకంపై రాష్ట్రవ్యాప్త సదస్సులు
Published Tue, Aug 27 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement