ఆ రాత్రప్పుడు భార్యకు ఫోన్ చేద్దామనే అనుకున్నాడు కాలజ్ఞ. కానీ చెయ్యలేదు. చేద్దామా వద్దా అని ఆగాడు. ఈలోపు మళ్లీ ఇంట్లోంచి ఎవరిదో సన్నగా ఏడుపు వినిపించింది! అతడు తప్ప అంతపెద్ద ఇంట్లో ఎవరూ లేరు. ఎవరూ లేకుండానే కాలజ్ఞకు ఏడుపు వినిపిస్తోందంటే ఇంట్లో ఎవరో ఉండి ఉండాలి! నవ్వుకున్నాడు కాలజ్ఞ. ‘భ్రాంతి’ కావచ్చు. బెంగళూరులో కాన్ఫరెన్స్ ఉంటే వెళ్లింది స్థిమిత. ఈమధ్యే వాళ్ల పెళ్లయింది. పెళ్లిరోజు అంతా అనుకున్నారు.. కాలజ్ఞ, స్థిమిత.. పేర్లు భలేగున్నాయని. ఆ రోజు ఎవరో జోక్ చేశారు కూడా. అమ్మాయి స్థిమితంగా ఉంటూ.. అబ్బాయి టైమ్ సెన్స్‌తో పరుగులు తీస్తూ ఉంటే.. ఆ దాంపత్యం చూడముచ్చటగా ఉంటుందని! ‘‘చూస్తుంటే అబ్బాయే స్థిమితంగా, అమ్మాయి పరుగులు తీస్తున్నట్లుగా ఉంది. అలాగున్నా కూడా దాంపత్యం చూడ ముచ్చటగానే ఉంటుందిలెండి’’.. అని నవ్వారెవరో. ‘‘దాంపత్యం ముచ్చటగా ఉండాలి కానీ, చూడ ముచ్చటగా ఉండకూడదు. ఉంటే.. చెడు కళ్లు పడతాయి’’.. ఇంకెవరో అన్నారు.
పెళ్లయి అప్పటికి కొన్ని రోజులే అవడం వల్లనో, భార్య బెంగళూరు వెళ్లి అప్పుడే ఇన్ని గంటలు అయిందా అనే భావన వల్లనో, ఇంట్లోంచి ఏడుపులేవో వినిపిస్తున్నాయన్న భయం వల్లనో.. కాలజ్ఞ తన భార్యకు ఫోన్ చేయాలని అనుకోలేదు. ఇంట్లో ఒక్కడికే ఏమీ తోచకుండా ఉంది. అందుకు చేయాలనుకున్నాడు. అతడికెప్పుడూ పక్కన ఒకరు ఉండాలి.. తను మాట్లాడ్డానికి, తనను మాట్లాడించడానికి.వాల్ క్లాక్‌లో టైమ్ చూశాడు కాలజ్ఞ. పదిన్నర. ఎందుకో అది కరెక్ట్ టైమ్ కాదనిపించింది. కనీసం పన్నెండైనా అయి ఉంటుందనుకుని ఫోన్‌లో చూసుకున్నాడు. తొమ్మిది కావస్తోంది! ‘స్ట్రేంజ్’ అనుకున్నాడు. అనుకుంటూ, వాల్ క్లాక్ వైపు చూశాడు. ఆగిపోయి ఉంది. ఒకవేళ వాల్‌క్లాక్ అప్పుడే ఆగిపోయి ఉండొచ్చని అనుకున్నా.. తొమ్మిది దగ్గర ఆగి ఉండాలి. పదిన్నర దగ్గర ఆగిపోయిందంటే.. ఆ ఉదయం పదిన్నరకో, క్రితం రోజు రాత్రి పదిన్నరకో ఆగి ఉండాలి. తను గమనించలేదా!
హైవేకి కాస్త దగ్గరగా రెండు కిలోమీటర్ల లోపలకి ఉంటుంది కాలజ్ఞవాళ్లు ఉంటున్న కాలనీ. అక్కడివన్నీ కొత్తగా కట్టిన ఇళ్లు. వాటిల్లో వీళ్లదొకటి. కొత్త ఇంట్లో కొత్త దంపతులు కాలజ్ఞ, స్థిమిత.రాత్రి తొమ్మిది గంటలకే జీవితం ఇంత అర్థరహితంగా అనిపిస్తోందంటే తెల్లారేవరకు ఈ రాహిత్యాన్ని భరించడం ఎలాగో కాలజ్ఞకు అర్థం కాకుండా ఉంది. బట్టలు వేసుకుని బైక్ తీశాడు. కారు కూడా ఉంది కానీ, బైక్ తీశాడు.అతడికి బైక్ నడపడం ఇష్టం. మణికొండలో సిద్ధార్థ వాళ్ల రూమ్‌కి వెళ్లి, రాత్రికి అక్కడే ఉండి, ఉదయాన్నే రావచ్చని అతడి ఆలోచన. అక్కడింకా ఇద్దరు ముగ్గురు ఓల్డ్‌మేట్స్ ఉంటారు. పెళ్లయ్యేవరకు ఆ రూమ్‌లోనే ఉండేవాడు కాలజ్ఞ. పెళ్లయ్యాక ఇతడు రూమ్ ఖాళీ చేసి వచ్చేస్తుంటే అంతా బోరుమన్నంత పనిచేశారు. ‘‘నీ ప్లేస్‌లోకి ఇంకొకర్ని రానివ్వం’’ అన్నాడు సిద్ధార్థ ఎమోషనల్‌గా. ‘‘అంటే.. నెల నెలా రెంట్‌లో నా షేర్ నేను పంపించాల్సిందేనా!’’ అని నవ్వాడు కాలజ్ఞ. ‘‘మమ్మల్ని మర్చిపోకు. అదే నీ షేర్’’ అన్నారు సిద్ధార్థ అండ్ బ్రోస్. ‘‘అయితే డన్’’ అని బొటనవేలెత్తి చూపించాడు కాలజ్ఞ. అదే ఆఖరు.కాలజ్ఞ మళ్లీ వాళ్ల వైపే చూడలేదు. ‘లైఫ్‌లో పడిపోయినట్లున్నాడు’ అని ఓసారెప్పుడో జోక్ చేసుకున్నారు ఓల్డ్‌మేట్స్. ‘లైఫ్‌లో కాదు. వైఫ్‌లో పడి ఉంటాడు’ అని కూడా అనుకున్నారు. అలా అనుకున్న సంగతి కాలజ్ఞకు ఫోన్ చేసి చెప్పారు కూడా. బైక్ మీద కొంత దూరం వెళ్లగానే.. హైవే మీదకు టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు.. ఆ మధ్యాహ్నం బెంగళూరు బయల్దేరేముందు స్థిమిత అన్న మాటలు గుర్తొచ్చాయి అతడికి.‘మార్నింగ్ కాన్ఫరెన్స్ అవగానే, ఈవెనింగ్ ఫ్లయిట్‌కి వచ్చేస్తాను. ఈ ఒక్కరాత్రికి ఫ్రెండ్స్ రూమ్‌కి వెళితేనేం అనుకోవద్దు’ అని చెప్పింది తను.
సిటీ అంతా ఊరికే ఓ రౌండ్ కొట్టి, ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు కాలజ్ఞ. మెయిన్ గేటు తీసి, బైక్‌ని లోపల పెట్టాడు. మెయిన్ గేట్‌కి తాళం వేసి, ఇంటి తలుపు తాళం తీస్తుండగా లోపలి నుంచి సన్నటి ఏడుపు వినిపించింది.షాక్ తగిలినట్లు ఆగిపోయాడు.అంతకు క్రితం తను ఇంట్లో ఉండగా వినిపించిన ఏడుపు లాంటిదే అది. లాంటిదే కాదు. అదే! ఆ ఏడుపును అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకున్నాడు. తాళం తీద్దామా వద్దా అని అక్కడే ఆగిపోయాడు. తియ్యకుండా బయటే ఉండి చేసేదేం లేదు. తీసి లోపలికి వెళ్లాడు. ఏడుపు ఆగిపోయింది. పక్కన ఇళ్లున్నాయి కానీ, ఏడుపు వినిపించేంత దగ్గరగా అవి లేవు. టీవీ ఆన్ చేశాడు.మళ్లీ సన్నగా ఏడుపు! ఈసారి చెవికి దగ్గరగా!అదిరిపడ్డాడు కాలజ్ఞ. తల తిప్పి చూశాడు. ఎవరూ లేరు. ఫ్రిజ్ డోర్ తెరిచి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. గటగటా రెండు గుక్కలు తాగాడు. తాగుతూ తాగుతూ టీవీ చానల్‌లో టైమ్ చూశాడు. పన్నెండు దాటి ఏడు నిముషాలు అవుతోంది. మరీ మనుషులు భయపడేంత టైమేతే కాదది. కాలజ్ఞకైతే అసలే కాదు. వాటర్ బాటిల్‌ని తిరిగి ఫ్రిజ్‌లో పెట్టబోతూ, ఫ్రిజ్‌పైన గోడకు ఉన్న వాల్‌క్లాక్ వైపు చూశాడు. పన్నెండూ ఏడు నిముషాలు!అప్పుడు భయపడ్డాడు కాలజ్ఞ. జీవితంలో ఎప్పుడూ భయపడనంతగా! పదిగంటల మీద ఆగిపోయిన గడియారం ముళ్లు ఇప్పుడు రైట్ టైమ్ చూపిస్తున్నాయి! బ్యాటరీ వీక్ అయి టైమ్ ఆగిపోయుంటే, ఒకవేళ బ్యాటరీ మళ్లీ తనంతటదే యాక్టివేట్ అయి ఉంటుందనుకున్నా.. ఫో¯Œ లో అంతకు క్రితం తను చూసినప్పుడు ఉన్న టైమ్‌కీ, వాల్ క్లాక్ టైమ్‌కీ గంటన్నర తేడా ఉండాలి. అలా లేదంటే.. ఇంట్లో కచ్చితంగా ఎవరో ఉన్నట్లు! ఎవరో ఉన్నట్లు కాదు. ఏదో ఉన్నట్లు.
ఏర్‌పోర్ట్‌లో స్థిమితను పికప్ చేసుకున్నాక, ఇద్దరూ కార్లో ఇంటికి వస్తున్నారు. రాత్రి ఇంట్లో జరిగిన వింతలు, విడ్డూరాల గురించి చెబుదామనుకున్నాడు. అలాంటివి తను నమ్మదు. అందుకే చెప్పలేదు. ఇంటి దగ్గర కారాగింది. బ్యాగ్‌తో పాటు చిన్న మొక్కను కూడా కార్లోంచి బయటికి తీసింది స్థిమిత. ‘‘తులసి మొక్కే కదా. ఏంటి స్పెషల్.. అంత దూరం నుంచి’’ అడిగాడు కాలజ్ఞ.‘‘కాన్ఫరెన్స్ అయ్యాక, టైమ్ దొరికితే.. అక్కడున్న మఠానికి వెళ్లాం. తిరిగొస్తుంటే స్వామీజీ నన్నొక్కదాన్నీ ఆగమని చెప్పి ఈ మొక్కను ఇచ్చారు. ‘కోట కట్టించి పెట్టు. పారిపోతుంది’ అన్నారు. ‘ఏం పారిపోతుంది?’ అని అడిగాను. ‘ఉన్నదే పారిపోతుంది’ అన్నారు’’ అని గలగలా నవ్వుతూ చెప్పింది స్థిమిత.కాలజ్ఞ మౌనంగా వింటున్నాడు. ‘‘ఏంటి మాట్లాడవు. నాకు తెలీకుండా ఎవరైనా ఉంటున్నారా మనింట్లో!’’.. అదే నవ్వుతో భర్త వైపు చూస్తూ అడిగింది స్థిమిత. కాలజ్ఞ నవ్వలేదు. నవ్వు ముఖం మాత్రం పెట్టగలిగాడు.
- మాధవ్ శింగరాజు
ఏంటి మాట్లాడవు?!
Published Sun, Sep 23 2018 12:32 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment