గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్‌సీ) 17వ రాష్ట్ర మహాసభలను ఈ నెల 12, 13 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. రాష్ట్రవిభజన తరువాత జరుగుతున్న తొలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన ప్రజలను కోరారు.
గుంటూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీఎల్‌సీ రాష్ట్ర ప్రతినిధులు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, 1973లో గుంటూరు కేంద్రంగా ఆవిర్భవించిన ఏపీసీఎల్‌సీ.. ప్రజాహక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లోనూ పౌరహక్కుల సంఘం నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో రాజ్యహింస, మతహింసలకు వ్యతిరేకంగా.. వనరుల దోపిడీ, రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగానూ ఉద్యమించాల్సి ఉందన్నారు. మహాసభలకు ప్రధాన వక్తలుగా ఖరగ్‌పూర్, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు అనంద్ తేల్ తుంబ్డే, కాత్యాయనీ విద్మహేలు హాజరవుతున్నారన్నారు. 13వ తేదీ సాయంత్రం గుంటూరులోనే బహిరంగసభ జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం నేతలు వైకే, వి.ప్రభాకర్, లక్ష్మారెడ్డి, రాజారావు, నరసింహారావు పాల్గొన్నారు.