
కలసి నడుద్దాం..!
► పరస్పర భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయం
► జీఎస్టీపై ట్రంప్ ప్రశంసలు..
► అమెరికా మా అత్యంత ప్రాధాన్య భాగస్వామి: మోదీ
► అమెరికన్ వస్తువుల దిగుమతికి అడ్డంకులు తొలగించండి: ట్రంప్
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సోమవారం శ్వేతసౌధంలో సుహృద్భావ వాతావరణంలో కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా.. మానవాళికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అంతంచేయటంతోపాటుగా పలు ద్వైపాక్షిక అంశాల్లో మరింత పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి (భారతకాలమానం ప్రకారం) శ్వేతసౌధంలో జరిగిన చర్చల అనంతరం వీరిద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు.
‘ఐసిస్, అల్‌కాయిదా, జైషే, లష్కరే, డీ–కంపనీ తదితర ఉగ్రవాద సంస్థలను ఏరివేయటమే మా తొలి ప్రాధామ్యం. ఈ దిశగా మా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాం’ అని వీరిద్దరు నేతలు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, ఇస్లామిక్ అతివాదంపై చర్చించామని.. ఈ అంశాల్లో పరస్పర సహకారానికి అంగీకరించామని ట్రంప్ వెల్లడించారు. వీరిద్దరి మధ్య సమావేశంలో ఉగ్రవాదంపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి సమగ్ర సదస్సుకు ఇరువురు నేతలూ సంపూర్ణ మద్దతు తెలిపారు.
చెప్పిందే చేస్తున్నా: ట్రంప్
‘నా ఎన్నికల ప్రచారంలోనే స్పష్టంగా చెప్పాను. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్వేతసౌధంలో భారత్‌కు విశ్వసనీయ మిత్రుడు ఉంటాడని చెప్పాను. చెప్పినట్లే చేస్తున్నాను’ అని ట్రంప్ తెలిపారు. నాలుగు రోజుల్లో అమల్లోకి రానున్న జీఎస్టీపైనా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ’గా పేర్కొన్నారు. ‘దేశంలో ఉపాధి అవకాశాలు పెంచాలని, మౌలికవసతుల కల్పన జరగాలని మీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అదే సమయంలో ప్రభుత్వంలోని అవినీతిపైనా పోరాటం చేస్తున్నారు. అవినీతి ప్రజాస్వామ్యానికి పెను సవాల్‌గా పరిణమించింది’ అని మోదీతో ట్రంప్ పేర్కొన్నారు. ‘భారత సామాజిక–ఆర్థిక పరిణామక్రమంలో, ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, పథకాల్లో అమెరికాను మా అత్యంత ప్రాధాన్య భాగస్వామిగా గుర్తిస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. ‘నా న్యూ ఇండియా ఆలోచన, ట్రంప్ ‘మేకింగ్ అమెరికా గ్రేట్ అగేన్’ నినాదాలు కలిసి.. మన దేశాలమధ్య సహకారాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్తాయని నేను భావిస్తున్నాను’ అని మోదీ అభిప్రాయపడ్డారు.
‘ద్వైపాక్షిక’ చరిత్రలో కీలక పేజీ
ట్రంప్‌తో జరిపిన చర్చలను భారత–అమెరికా సంబంధాల చరిత్రలో అత్యంత ముఖ్యమైన పేజీగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భద్రత, రక్షణ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం, సాంకేతికత, సృజనాత్మకత వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని వెల్లడించారు. కాగా, భారత మార్కెట్లలో అమెరికన్ వస్తువుల దిగుమతికున్న అడ్డంకులను తొలగించాలని ఈ సందర్భంగా మోదీని ట్రంప్ కోరారు.
‘మీ దేశంతో మా వాణిజ్యలోటును తగ్గించుకోవటం మాకు చాలా ముఖ్యం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 100 అమెరికన్ విమానాలకోసం ఆర్డరు చేయటాన్ని కూడా ట్రంప్ స్వాగతించారు. దీని వల్ల లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అంతకుముందు, వైట్‌హౌజ్‌లో ప్రధాని మోదీకి సాదర స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా మోదీకి ఆత్మీయ స్వాగతం పలికి, వైట్‌హౌస్‌లోనికి తీసుకువెళ్లారు.
అమెరికాకు తలొగ్గారు: విపక్షాలు
న్యూఢిల్లీ: మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆ ప్రకటన ఇస్లాం ఉగ్రవాదంపై అమెరికా అభిప్రాయాలకు దగ్గరగా ఉందన్నాయి. అది పూర్తిగా నిరాశపరచిందని తెలిపాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబం ధించి కొత్త విషయాలేం అందులో లేవని ఎత్తిపొడిచాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు తేవడానికి బదులు, పక్కదారి పట్టించేలా ప్రకటన ఉందన్నాయి. ఇస్లాం మతం, ఉగ్రవాదాలకు ఇచ్చే వివరణలపై ట్రంప్ ప్రభుత్వం, భారత్ ఒకే రీతిలో స్పందించకలేకపోయాయని కాంగ్రెస్ ప్రతినిధి తివారి ఆరోపించారు.