అమెరికాకు ఝలక్ ఇచ్చిన పాక్!
ద్వైపాక్షిక చర్చలు, అమెరికా పర్యటనలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దాయాది నిరసన వ్యక్తం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగా అమెరికాతో ద్వైపాక్షిక చర్చలను, అమెరికా పర్యటనలను రద్దుచేసుకుంటున్నట్టు ప్రకటించింది.
అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్‌పై అమెరికా విధాన ప్రకటన సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ సెనేట్ కమిటీకి ఆ దేశ విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారని 'ద నేషన్' పత్రిక తెలిపింది. ఖవాజా గతవారం అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా.. చివరక్షణంలో వెనుకకు తగ్గిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌కు అమెరికా సీనియర్ అధికారి పర్యటన సైతం వాయిదా పడింది. కరాచీలో అమెరికా వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా వేసుకోవాలని పాక్ కోరిందని, ఈ నేపథ్యంలో ఇరుదేశాలకు సౌకర్యవంతమైన సమయంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక ఉప కార్యదర్శి అలైస్ వెల్స్ ఇస్లామాబాద్ పర్యటన ఉంటుందని పాక్‌లోని అమెరికా రాయబారి తెలిపారు.
అఫ్ఘానిస్థాన్‌లో అమెరికన్ పౌరులను చంపుతున్న ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారి ఆశ్రయం ఇస్తున్నదని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో సంబంధాలకు దూరం జరిగామని పాక్ పేర్కొంటున్నది.