ప్రధాని మోదీని ‘రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్’ మెడల్‌తో సత్కరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్
మాలి: ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారిందని, దీనిపై పోరాటం సాగించేందుకు అందరూ ఏకం కావాలని భారత ప్రధాని మోదీ ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాల్దీవుల పార్లమెంట్ మజ్లిస్‌నుద్దేశించి ప్రసంగించారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా మొట్టమొదటి పర్యటన మాల్దీవులతో ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీకి చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం రిపబ్లిక్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సోలిహ్ సాదర స్వాగతం పలికారు. మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ ఆయనకు విదేశీ ప్రముఖులకిచ్చే అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్‌తో గౌరవించారు. మోదీ భారత క్రికెట్ జట్టు సభ్యుల సంతకాలతో కూడిన క్రికెట్ బ్యాట్‌ను సోలిహ్‌కి బహూకరించారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు క్రికెట్ దోహదపడుతుందని, మాల్దీవుల్లో క్రికెట్ అభివృద్ధికి సాయపడతామని తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించడం వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఉగ్రవాదంపై అంతర్జాతీయ సదస్సు జరగాలి
చరిత్రకు పూర్వం నుంచే భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవుల పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ..స్పీకర్‌గా ఎన్నికైన మొహమ్మద్ నషీద్ మజ్లిస్‌మొదటి సమావేశానికి తనను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ప్రతి భారతీయుడిని కదిలించి, ఇక్కడి ప్రజల పట్ల గౌరవాన్ని పెంచిందన్నారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యం బలపడేందుకు ప్రతి భారతీయుడూ వెన్నంటి ఉంటారని భరోసా ఇచ్చారు.
‘ఉగ్రవాదం ఏదో ఒక దేశానికే పరిమితమైంది కాదు, అది నాగరికతకే పెనుముప్పు. ప్రపంచ దేశాలన్నీ కలిసి వాతావరణ మార్పులపై సమావేశాలు, చర్చలు జరిపిన విధంగానే ఉగ్రవాదం అంశంపైనా అంతర్జాతీయ సదస్సు జరపాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల్లో మంచి వారు, చెడ్డ వారు ఉన్నారంటూ కొందరు తేడా చూపుతూ పొరపాటు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల ప్రేరేపిత ఉగ్రవాదం ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ తరహా ఉగ్రవాదం తీవ్ర ప్రమాదకరంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రపంచ నేతలంతా ఏకం కావాలని ఆయన కోరారు.
ఇద్దరు నేతల ఉమ్మడి ప్రకటన
రెండు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ నిర్ణయించారు. ఈ మేరకు వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘రెండు దేశాల ఉమ్మడి భద్రతా పరమైన అంశాల గుర్తించి, ఈ ప్రాంతంలో సుస్థిరత సాధించేందుకు పరస్పరం సహకరించుకోవాలి. రెండు దేశాల్లోనూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరగనివ్వరాదు. హిందూమహా సముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు సహకారం బలోపేతం చేసుకోవాలి. సమన్వయంతో కూడిన గస్తీ, నిఘా, సమాచార మార్పి, బలగాల పెంపు తదితర అంశాల ద్వారా సముద్ర ప్రాంత రక్షణను బలోపేతం చేసుకోవాలి.
మెరుగవుతున్న సంబంధాలు
గత ఏడాది నవంబర్‌లో సోలిహ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. భారత ప్రధాని మాల్దీవులు సందర్శించడం ఎనిమిదేళ్లలో అదే ప్రథమం. గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ చైనా పరోక్ష జోక్యం ప్రభావం ఫలితంగా దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడం వంటి పలు చర్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన విషయం తెలిసిందే. సోలిహ్ అధికారంలోకి వచ్చాక భారత్–మాల్దీవుల సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన సందర్భంగా బెంగళూరులో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ వీక్షించారు. అనంతరం ఆయన తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత్ సాయం కోరారు.
కేరళ నాకెంతో ప్రియమైనది
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో గెలచాక మోదీ తొలిసారిగా కేరళలో పర్యటించారు. కేరళ బీజేపీ విభాగం ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ప్రధాని.. తన సొంత నియోజకవర్గం వారణాసి మాదిరిగానే కేరళ తనకెంతో ప్రియమైనదని చెప్పారు. బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ ఈ ఎన్నికలు వ్యతిరేక శక్తుల్ని తిరస్కరించాయి. చెడుపై మంచి విజయం సాధించింది. ఇదే స్ఫూర్తితో నవ భారత నిర్మాణానికి అందరం కలసికట్టుగా పనిచేయాలి‘‘ అని మోదీ పిలుపునిచ్చారు. కేరళలో మాకు ఒక్క సీటు రాకపోయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలపై ఎంతో గౌరవం ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతో అద్భుతమైనవారు. వారితో బంధం మరింత దృఢపడాలని కోరుకుంటున్నాను‘‘ అని అన్నారు.
గురువాయూర్‌లో మోదీ తులాభారం
కేరళ పర్యటనలో భాగంగా మోదీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శిం చుకున్నారు. స్వామివారి సమక్షంలో తామరపూలతో తులాభారం నిర్వహించారు. తామరపూలతో మోదీ శ్రీకృష్ణుడికి మొక్కును చెల్లించుకున్నారు. గురువాయూర్ ఆలయం పరమపవిత్రమైనది. కృష్ణ భగవానుడికి అరటిపళ్లు, తామరపూలు, నెయ్యి సమర్పించారు. ప్రధాని మోదీ శ్రీకృష్ణ ఆలయంలో దాదాపుగా 20 నిముషాల సేపు గడిపారు. కేరళ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభాలతో శ్రీకృష్ణ ఆలయ అధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ వస్త్రధారణ అయిన తెలుపు రంగు ముండు(ధోతీ), కుర్తాతో పాటు శాలువాను మోదీ ధరించారు.
గురువాయూర్‌లో పంచెకట్టులో ప్రధాని అభివాదం. తామరపుష్పాలతో తులాభారం దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment