
మయన్మార్‌కు అండగా ఉంటాం
* ఆ దేశాధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రధాని మోదీ
* భారత్‌తో సంబంధాల మెరుగే మా అభిమతం: హతిన్ క్యా
* ఉగ్రవాదం, చొరబాట్లపై ఉమ్మడి పోరుకు అంగీకారం
న్యూఢిల్లీ: మయన్మార్ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని భారత్ సోమవారం హామీఇచ్చింది. మయన్మార్ సరికొత్త ప్రయాణంలో అండగా ఉంటామంది. మయన్మార్ అధ్యక్షుడు యు హతిన్ క్యా భారత పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.
రెండు దేశాల మధ్య సంబంధాల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది భారత్ ఆకాంక్షని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరు, చొరబాటు కార్యక్రమాల నిరోధంలో కలిసికట్టుగా సాగాలని, చురుకైన సహకారం అందించుకోవాలని భేటీలో ఇరు దేశాలు నిర్ణయించాయి. మయన్మార్‌కు దగ్గరయ్యేందుకు చైనా ప్రయత్నాల నేపథ్యంలో... క్యా భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల సందర్భంగా ఇరు దేశాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
రవాణా, వైద్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సంబంధాల్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రసంస్థలు మయన్మార్‌లో విస్తరించిన విషయాన్ని భారత్ గుర్తుచేసింది. భారత్-మయన్మార్-థాయ్‌లాండ్‌ల గుండా సాగే రహదారి ప్రాజెక్టులో భాగంగా కలేవా-యార్గి విభాగం నిర్మాణం, 69 వంతెనల నిర్మాణం, అభివృద్ధి కోసం 2ఒప్పందాలు జరిగాయి.
మయన్మార్ అభివృద్ధిలో భాగస్వామ్యం
భేటీ తర్వాత మోదీ మాట్లాడుతూ... ‘మయన్మార్ వేసే ప్రతీ అడుగులో 125 కోట్ల మంది భారతీయులు భాగస్వాములుగా, స్నేహితులుగా అండగా ఉంటారని హామీనిస్తున్నా. ఒకరి భద్రతా అవసరాలు మరొకరితో ముడిపడి ఉన్నాయని ఇరుదేశాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరు, చొరబాటు ప్రయత్నాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
దాదాపు రూ. 13,600 కోట్ల అభివృద్ధి పనుల్లో మయన్మార్‌కు భారత్ సాయం అందిస్తోంది. రవాణా, మౌలిక సదుపాయలు, విద్య, వైద్యం, ఇతర రంగాల్లో ప్రాజెక్టులకు సహకరిస్తున్నాం. ఈ ఏడాది చివరిలో మయన్మార్‌లోని కాలాదాన్ పోర్టు ప్రాజెక్టు పూర్తి కానుంది. ఏప్రిల్‌లో మయన్మార్‌లోని తముకు విద్యుత్ సరఫరా చేసి చిన్న అడుగు ముందుకేశాం. విద్యుత్ సరఫరా సాయాన్ని పెంచుతామని ఆ దేశాధ్యక్షుడికి చెప్పాను. భారత్‌తో నైరుతి ఆసియాను కలపడంలో మయన్మార్ వారధిగా ఉంది.
‘21వ శతాబ్ది పాంగ్‌లాంగ్ సదస్సు’లో నిర్ణయించిన మేరకు మయన్మార్‌లో శాంతి ప్రక్రియకు పూర్తి మద్దతు ఇస్తాం. మయన్మార్ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆ దేశ నాయకుల పరిణితి, నిబద్ధతను అభినందిస్తున్నా. బౌద్ధ మతంలోని దయను ప్రేమించడం, అన్ని మతాల మధ్య సమానత్వం మన జీవితాల్ని నిర్వచిస్తుంది. బగన్‌లోని ఆనంద ఆలయం పునరుద్ధరణలో మన పాత్ర ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇతర చారిత్రక నిర్మాణాలు, పగోడాలు పునరుద్ధణలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ’ అని మోదీ చెప్పారు.
గయను సందర్శించిన హతిన్ క్యా
ఈ సందర్భంగా హిన్ క్వా మాట్లాడుతూ... భారత్‌తో సంబంధాలు బలపరచుకోవాలనేది తమ కోరికన్నారు. శనివారం భారత్ చేరుకున్న క్వా.. బౌద్ధ పుణ్యక్షేత్రం గయలో పర్యటించారు. మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. దైజోక్యో బౌద్ధ ఆలయం, మయన్మార్ బౌద్ధ విహారాన్ని కూడా తిలకించారు. అనంతరం ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ను సందర్శించారు. సోమవారం ఉదయం ప్రధానితో భేటీకి ముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు.