ప్రధాని హోదాలో అమెరికాకు మోడీ
న్యూఢిల్లీ : ఎట్టకేలకు నరేంద్ర మోడీ భారత ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై అడుగు పెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వ ఘన విజయాన్ని దక్కించుకున్న సందర్భంగా మోడీకి... అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. తమ దేశానికి రావాలని మోడీని ఈ సందర్భంగా ఒబామా ఆహ్వానం పలికారు.
ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సెప్టెంబర్లో అమెరికా వెళ్లనున్నారు. వాషింగ్టన్లో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో మోడీ, ఒబామా పాల్గొననున్నారు. దీంతో భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలకు కొత్త అధ్యయనం మొదలైందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమావేశాలు జరిగే తేదీలు ఖరారు కావాల్సి ఉంది.
ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వీలుగా ఇరువురికీ ఆమోదనీయమైన సమయంలో రావాలని అమెరికా సెప్టెంబర్ 30వ తేదీని ప్రతిపాదించగా, భారత్ మాత్రం సెప్టెంబర్ 26వ తేదీని సూచించింది. దీనిపై మోడీ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా 2002నాటి గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందన్న ఆరోపణలతో అమెరికా ఆయన వీసాపై 2005లో నిషేధం విధించింది. ఆ నిషేధం మోడీ ప్రధాని పీఠం ఎక్కేవరకూ కొనసాగిన విషయం తెలిసిందే.