న్యూఢిల్లీ: జీ20 నేపథ్యంలో ఢిల్లీకి మొదటగా వచ్చిన నేతల్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఒకరు. ప్రధాని మోదీ మొట్టమొదటి సమావేశం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తోనే జరిగింది. గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ‘రెండు దేశాల నడుమ సంబంధాలు ఏర్పాటై 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫిన్‌టెక్, సాంస్కృతిక తదితర రంగాల్లో సహకారంపై చర్చించాం’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
‘భారత్ దార్శనిక కార్యక్రమం ‘సాగర్’లో మారిషస్ వ్యూహాత్మక కీలక భాగస్వామి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు’అని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాల్లో సహకారం విస్తృతం చేసుకునేందుకు, రెండు దేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. తాజాగా ప్రధాని హసీనాతో చర్చలు ఫలప్రదమయ్యాయని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కనెక్టివిటీ, సాంస్కృతిక రంగాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారని పీఎంవో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment