
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవి ఎలాంటి షరతులకు, వాణిజ్య, రాజకీయ పరిమితులకు లోబడి ఉండేవి కావని తేల్చి చెప్పారు. పోర్ట్ లూయీస్‌లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని గురువారం ఆయన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
భాగస్వామ్య దేశాలను గౌరవించడం భారత్ పాటించే ప్రాథమిక సూత్రమన్నారు. అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలోభారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.