Pravind Jugnauth
-
G-20 Summit: బంగ్లా, మారిషస్ ప్రధానులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: జీ20 నేపథ్యంలో ఢిల్లీకి మొదటగా వచ్చిన నేతల్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఒకరు. ప్రధాని మోదీ మొట్టమొదటి సమావేశం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తోనే జరిగింది. గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ‘రెండు దేశాల నడుమ సంబంధాలు ఏర్పాటై 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫిన్‌టెక్, సాంస్కృతిక తదితర రంగాల్లో సహకారంపై చర్చించాం’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘భారత్ దార్శనిక కార్యక్రమం ‘సాగర్’లో మారిషస్ వ్యూహాత్మక కీలక భాగస్వామి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు’అని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాల్లో సహకారం విస్తృతం చేసుకునేందుకు, రెండు దేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. తాజాగా ప్రధాని హసీనాతో చర్చలు ఫలప్రదమయ్యాయని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కనెక్టివిటీ, సాంస్కృతిక రంగాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారని పీఎంవో తెలిపింది. -
విశ్వ శ్రేయస్సు భారత్ ధ్యేయం
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవి ఎలాంటి షరతులకు, వాణిజ్య, రాజకీయ పరిమితులకు లోబడి ఉండేవి కావని తేల్చి చెప్పారు. పోర్ట్ లూయీస్‌లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని గురువారం ఆయన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. భాగస్వామ్య దేశాలను గౌరవించడం భారత్ పాటించే ప్రాథమిక సూత్రమన్నారు. అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలోభారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. -
మెరుగైన భవిష్యత్తుకే!
న్యూఢిల్లీ: మెరుగైన భవిష్యత్తును కల్పించే ఉద్దేశంతోనే విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి భారత పౌరసత్వం కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, హింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత తొలిసారి ప్రధాని ఈ విధంగా స్పందించారు. భరతమాతపై విశ్వాసమున్న, విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి మెరుగైన భవిష్యత్తును హామీ ఇస్తూ భారత్‌కు స్వాగతం పలుకుతున్నాం’ అని హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో శుక్రవారం మోదీ వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పుపై స్పందిస్తూ.. ‘తీర్పు వల్ల సమాజంలో అశాంతి నెలకొనే అవకాశముందని తీర్పునకు ముందు చాలామంది అనుమానించారు. కానీ వారి అనుమానాలు తప్పని ప్రజలు నిరూపించారు’ అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై.. ‘అది రాజకీయంగా కష్టమైన చర్యగా కనిపించవచ్చు, కానీ ఆ నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ ప్రజల అభివృద్ధికి ఒక ఆశాకిరణంగా మారింది’ అని స్పందించారు. మారిషస్ ప్రధానితో భేటీ భద్రమైన, స్థిరమైన, ప్రగతిశీల మారిషస్ నిర్మాణానికి తమ సహకారం ఎల్ల వేళలా ఉంటుందని భారత్ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శుక్రవారం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగనాధ్తో భేటీ అయ్యారు. మారిషస్ పార్లమెంట్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రవింద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, మారిషస్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. తమ దేశంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యం ఉందని మారిషస్ ప్రధాని గుర్తు చేశారు. మోదీకి ఉద్ధవ్ స్వాగతం పుణె: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ)ల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి ఉద్ధవ్ ఠాక్రే పుణె విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గవర్నర్ కోశ్యారీ, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా ఉన్నారు. -
తండ్రి రాజీనామా.. కుమారుడికి పదవి
పోర్ట్లూయిస్: భారత సంతతికి చెందిన మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ (86) తన పదవికి రాజీనామా చేసి.. కొడుకు, ఆర్థిక మంత్రి ప్రవింద్ జగన్నాథ్ (50)కు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ప్రవింద్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆ దేశాధ్యక్షుడు అమీనా గురిబ్-ఫకీమ్ నియామక లేఖ పంపారు. అనంతరం ప్రవింద్ కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. అనిరుధ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. యంగ్, డైనమిక్ నాయకుడిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు వీలుగా తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మారిషస్ జాతీయ అసెంబ్లీలో అధికార మిలిటెంట్ సోషలిస్ట్ మూవ్మెంట్ పార్టీకి మెజార్టీ ఉంది. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల మద్దతు గల సభ్యుడిని ప్రధానిగా అధ్యక్షుడు నియమిస్తారు. కాగా అధికార మార్పిడిని ప్రతిపక్ష లేబర్ పార్టీ తప్పుపట్టింది. దేశానికి చీకటి దినమని, ఇది తండ్రీకొడుకుల ఒప్పందం అని విమర్శించింది.