చర్చలు మళ్లీ మొదలెడదాం.. | Pakistan PM seeks to resume dialogue on Kashmir and terrorism | Sakshi
Sakshi News home page

చర్చలు మళ్లీ మొదలెడదాం..

Published Fri, Sep 21 2018 4:52 AM | Last Updated on Fri, Sep 21 2018 9:32 AM

Pakistan PM seeks to resume dialogue on Kashmir and terrorism - Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌–పాక్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు సంసిద్ధత తెలుపుతూ ప్రధాని మోదీకి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లేఖ రాశారు. ద్వైపాక్షిక బంధాలకు సవాల్‌గా మారిన ఉగ్రవాదం, కశ్మీర్‌ సహా ఇతర కీలకమైన అంశాలపై చర్చకు సిద్ధమేనని గురువారం మోదీకి రాసిన లేఖలో ఇమ్రాన్‌∙పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 14న ఇమ్రాన్‌ ఈ లేఖ రాసినట్లు ఇస్లామాబాద్‌లోని పాక్‌ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్‌ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్‌ ప్రతిపాదించారు. ‘భారత్‌–పాక్‌ మధ్య సంబంధాల్లో సవాళ్లున్నాయి. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనే ప్రక్రియకు ఐరాస సభలో సమావేశం ఉపయుక్తమవుతుందని భావిస్తున్నా’ అని ఇమ్రాన్‌ లేఖలో పేర్కొన్నారు. ‘పాక్‌  ప్రజలు, భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్‌ సహా అన్ని అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం. అభిప్రాయభేదాలను రూపుమాపి పరస్పర ప్రయోజనం కలిగేలా చర్చలు జరగాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి.. ఇరుదేశాల సంబంధాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేశారన్నారు.

నిర్మాణాత్మక చర్యలకు సిద్ధమే..
ఆగస్టు 18న మోదీ ఇరుదేశాల సత్సంబంధాలను కాంక్షిస్తూ ఇమ్రాన్‌కు లేఖ రాశారు. పాక్‌తో అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమేనని.. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. పాక్‌ ఎన్నికల్లో గెలిచాక ద్వైపాక్షిక బంధాలపై ఇమ్రాన్‌ మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు.

శాంతికి ముందడుగు: పీడీపీ
ఇమ్రాన్‌  లేఖకు మోదీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) ఆశాభావం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా భారత్‌–పాక్‌ మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని పేర్కొంది. ఐరాస సభ సమావేశం సందర్భంగా ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగితే.. శాంతి చర్చలకు ముందడుగు పడినట్లేనని వెల్లడించింది.  

భేటీ కానున్న విదేశాంగ మంత్రులు
ఐరాస సర్వప్రతినిధి సభ సందర్భంగా న్యూయార్క్‌లో వచ్చేవారం భారత్, పాక్‌ విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. 2016 పఠాన్‌కోట్‌ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. మోదీకి ఇమ్రాన్‌ లేఖలో ప్రతిపాదించినందుకు సానుకూలంగా వీరిద్దరి భేటీ జరుగనుందని.. ఈ సమావేశం ద్వారా భారత్‌–పాక్‌ మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైందని భావించనక్కర్లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ దృష్టికోణంలో మార్పు ఉండబోదన్నారు. పాక్‌ గడ్డపై ఉగ్రవాద కేంద్రాల విషయంలో పాక్‌ను నిలదీసే వైఖరినే భారత్‌ ప్రదర్శిస్తుందన్నారు. పాకిస్తాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం కర్తార్పూర్‌ సాహిబ్‌ను భారత సిక్కులు దర్శించుకునేందుకు అనుమతివ్వడంపైనా సుష్మాæస్వరాజ్‌ మాట్లాడతారని రవీశ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement