న్యూఢిల్లీ : కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విటర్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని భారత్, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఇమ్రాన్ ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు.
అయితే రవీశ్ కుమార్ స్పందిస్తూ.. ‘కశ్మీర్ సమస్యపై భారత్, పాక్‌లు కోరితే మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యాలను చూశాం. కానీ ప్రధాని మోదీ అలా ఎప్పుడూ ట్రంప్‌ను కోరలేదు. కశ్మీర్ అనేది భారత్‌కు సుస్థిరమైన స్థానం. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై కేవలం ద్వైపాక్షికంగానే చర్చలు జరుపుతాం. ఈ విధమైన చర్చలు జరపాలంటే సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలకాలి. షిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ కూడా ఇరు దేశాల మధ్య సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కారించుకోవాలని సూచిస్తున్నాయ’ని గుర్తుచేశారు. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ చాన్నాళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.
...that all outstanding issues with Pakistan are discussed only bilaterally. Any engagement with Pakistan would require an end to cross border terrorism. The Shimla Agreement & the Lahore Declaration provide the basis to resolve all issues between India & Pakistan bilaterally.2/2
— Raveesh Kumar (@MEAIndia) July 22, 2019
Comments
Please login to add a commentAdd a comment