
స్టాక్‌హోం: రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, స్వీడన్‌లు నిర్ణయించాయి. సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంతో పటిష్ట సహకారానికీ అంగీకరించాయి. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రాత్రి స్వీడన్ చేరుకున్నారు. స్టాక్‌హోం విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్ స్వాగతం పలికారు. తర్వాత స్వీడన్ ప్రధాని కార్యాలయంలో లోఫెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
లోఫెన్‌తో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయని విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. ‘స్వీడన్ రాజుతో భేటీ, ఆ దేశ ప్రధాని, 4 నార్డిక్ దేశాల నేతలతో చర్చలు, స్వీడిష్ సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశం, ప్రతిపక్ష నేతలతో సమాలోచనలతోపాటు భారత్–నార్డిక్ సమిట్ అండ్ కమ్యూనిటీ ఈవెంట్‌లో ప్రధాని పాల్గొన్నారు’ అని తెలిపారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, ప్రాంతీయ, బహుముఖ సహకారంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారన్నారు.
భారత్ – స్వీడన్‌లు సంయుక్తంగా నిర్వహించిన 4 నోర్డిక్ దేశాల(ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, డెన్మార్, నార్వే) సదస్సులో మోదీ మాట్లాడారు. ఆ దేశాల ప్రధానులతో విడివిడిగా చర్చించారు. స్వీడన్ పర్యటన అనంతరం ప్రధాని మంగళవారం రాత్రి బ్రిటన్‌కు(గ్రీన్‌విచ్ కాలమానం) బయల్దేరారు. బ్రిటన్‌లో జరిగే చోగమ్(కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం)లో ఆయన పాల్గొంటారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ద్వైపాక్షిక చర్చలతో పాటు రాణి ఎలిజబెత్–2తో భేటీ కానున్నారు.
భారత్ అభివృద్ధిలో స్వీడన్ సహకారంపై చర్చలు: మోదీ
చర్చల తర్వాత మోదీ, లోఫెన్‌లు మీడియాకు సంయుక్త ప్రకటన విడుల చేశారు. ‘భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో స్వీడన్ ఏ విధంగా సాయపడగలదన్న అంశంపై దృష్టిసారించాం. మొదటి నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమానికి స్వీడన్ బలమైన మద్దతుదారుగా ఉంది. 2016లో మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో లోఫెన్ తమ వ్యాపార ప్రతినిధి బృందంతో కలిసి పాల్గొన్నారు. సరికొత్త భాగస్వామ్యం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు రెండు దేశాలు అంగీకరించాయి.
ఆవిష్కరణలు, పెట్టుబడులు, స్టార్టప్‌లు, ఉత్పత్తి మొదలైనవి ఇరు దేశాల మధ్య సహకారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటితో పాటు పునరుత్పాదక ఇంధనం, పట్టణ రవాణా, వర్థ్యాల నిర్వహణకు మేం ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని ప్రకటనలో మోదీ తెలిపారు. ‘రక్షణ రంగంలో స్వీడన్ భారతదేశ భాగస్వామిగా ఉంది. రక్షణ రంగ ఉత్పత్తులు, సైబర్ సెక్యూరిటీతో సహా రక్షణ, భద్రతా అంశాలపై అవగాహన కుదిరింది’ అని ప్రధాని వెల్లడించారు.
అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను స్వీడన్ ప్రధాని లోఫెన్ కొనియాడారు. రెండు దేశాలు మంచి జోడీ అని సంయుక్త ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. హరిత సాంకేతికత, స్మార్ట్ సిటీస్ రంగాల్లో సహకారంపై ఇరు నేతల మధ్య చర్చలు జరిగాయి. చర్చల కోసం స్వీడన్ ప్రధాని నివాసం నుంచి కార్యాలయానికి లోఫె న్‌తో కలిసి ప్రధాని నడిచివెళ్లడం గమనార్హం.
లండన్‌లో మోదీకి నిరసన స్వాగతం
లండన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి నిరసనల స్వాగతం లభించనుంది. చిన్నారి అసిఫాపై హత్యాచారానికి నిరసనగా బ్రిటన్‌లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్ స్క్వేర్ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. భారత్‌లో అత్యాచారాల్ని ఖండిస్తూ తెల్లని దుస్తుల్లో నేడు వీరు నిరసన తెలపనున్నారు.
అలాగే పార్లమెంట్ స్క్వేర్ వద్ద జరిగే భారత వ్యతిరేక ప్రదర్శనకు పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు లార్డ్ అహ్మద్ నేతృత్వం వహించనున్నారు. ‘పంజాబ్ రిఫరెండం 2020 ఖలిస్తాన్’ పేరిట యూకే సిక్కు సమాఖ్య లండన్‌లో బస్సులపై బ్యానర్లను ప్రదర్శించి నిరసన తెలియచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment