చెన్నై: తూర్పు ఆఫ్రికా దేశం రువాండాకు చెందిన మంత్రి కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ దేశ రాయబారి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకుని, ఆమెను కాపాడారు. వివరాలివీ.. మేరీగ్రేస్(18) రాశీపురంలోని ఒక ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మైక్రోబయాలజీ రెండో సంవత్సరం చదువుతుంది. రాశీపురం సమీపంలోని కోనేరిపట్టిలో నివసించే ప్రభుదాస్ అనే వ్యక్తి ఇంటిలో ఈమె ఉంటోంది. ఈ నెల 1వ తేదీ మూడో సెమిస్టర్ పరీక్ష ముగిసిన తరువాత 8వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. 5వ తేదీ వరకు రాశీపురంలోనే ఉండిన మేరీగ్రేస్ 6వ తేదీన కనిపించకుండా పోయింది. చెన్నైకి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి ఉండొచ్చని భావించారు. అయితే కొందరు వ్యక్తులు రువాండా దేశంలోని యువతి తండ్రికి ఫోన్ చేసి డబ్బు కోసం బెదిరించడంతో కిడ్నాప్‌నకు గురైనట్లు నిర్ధారణైంది. దీంతో యువతి తల్లిదండ్రులు ఢిల్లీలోని రువాండా రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.
రువాండా రాయబార కార్యాలయం అధికారి ఎమిలీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. పశ్చిమ మండల ఐజీ శంకర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. యువతి సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా కోల్‌కతాలో ఉన్నట్లు గుర్తించి, రక్షించారు. నిందితులను పట్టుకున్నారు. రువాండా దేశానికి చెందిన కొందరు యువకులు యువతితో నెట్‌చాటింగ్‌లో స్నేహం చేశారు. కోల్‌కతాలో ఉచితంగా విద్య అందిస్తున్నట్టు నమ్మించి, రప్పించుకున్నారు. నిందితుల అదుపులోకి యువతి చేరిన వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి 3 లక్షల డాలర్లు ఇస్తే వదిలిపెడతామని బేరం పెట్టారు. ఈలోగా పోలీసులకు పట్టుబడ్డారు. బాధిత యువతితోపాటూ కిడ్నాప్‌నకు పాల్పడిన బందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గురువారం రాశీపురం చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మంత్రి కూతురి కిడ్నాప్... డబ్బు డిమాండ్!
Published Thu, Dec 10 2015 9:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
Advertisement
Advertisement