అధ్యక్ష భవనంలో ఉగాండా దేశాధ్యక్షుడు యువేరీతో ప్రధాని మోదీ కరచాలనం
కిగాలి: రువాండా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మంగళవారం రువేరు అనే గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేదలకు 200 ఆవులను కానుకగా ఇచ్చారు. పేదరికం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు కుటుంబానికొక ఆవును పంపిణీచేయడం 2006 నుంచి అక్కడ సంప్రదాయంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ‘గిరింకా’ అని పిలుస్తున్నారు.
ఆర్థిక ప్రయోజనాల రీత్యా రువాండాలోని మారుమూల గ్రామంలో ఆవులకు ఇస్తున్న ప్రాధాన్యం భారతీయులను సంతోషానికి గురిచేస్తుందని మోదీ అన్నారు. గిరింకా గ్రామాల్లో గొప్ప మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంపై కూడా దృష్టిపెట్టాలని రువాండా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
ఆఫ్రికా తాళంచెవి రువాండా..
మోదీ రువాండాలో ప్రవాసులతో మాట్లాడుతూ.. ప్రపంచం దృష్టి ఆఫ్రికాపై పడకముందే, భారతీయులు అక్కడికి వెళ్లడానికి ప్రాధాన్యమిచ్చారని అన్నారు. ప్రవాస భారతీయులు ఎక్కడున్నా తమ ప్రత్యేకతను చాటుకుంటూ దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని కితాబిచ్చారు. అంతకుముందు, ఆ దేశాధ్యక్షుడు కగామేతో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. వ్యవసాయం, రక్షణ, వాణిజ్యం, ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
వాణిజ్యవేత్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఆఫ్రికాకు దారితీసే అన్ని ప్రవేశద్వారాల తాళంచెవి రువాండా వద్దే ఉందని అన్నారు. ఆ దేశ అభివృద్ధికి భారత్ సహకారం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రెండు దేశాల వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భారత్‌లో అమలుచేస్తున్న ‘మేకిన్ ఇండియా’లో రువాండా కూడా భాగమైతే, రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని అన్నారు. తర్వాత మోదీ రువాండా పర్యటనను ముగించుకొని ఉగాండా చేరుకున్నారు.
ఉగాండాకు రూ.1377 కోట్ల రుణం...
కంపాలా: ఉగాండాకు భారత్ రూ.1377 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ నిధులను ఇంధన మౌలిక వసతులు, వ్యవసాయం, పాడి రంగాల అభివృద్ధికి వెచ్చించనున్నారు. ఉగాండాలో ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు యువేరి ముసెవేనితో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రక్షణ సహకారం, దౌత్యవేత్తలు, ఇతర అధికారులకు వీసా మినహాయింపు, సాంస్కృతిక మార్పిడి, మెటీరియల్ టెస్టింగ్ లేబొరేటరీలపై 4 ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
నేటి నుంచి బ్రిక్స్ సదస్సు
దక్షిణాఫ్రికాలో మూడు రోజులపాటు..
జోహన్నెస్‌బర్గ్: అమెరికా వైఖరి కారణంగా ఏర్పడుతున్న అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ వాతావారణంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా మూడు రోజుల బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ పదవ సదస్సుకు ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసాతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా, చైనాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్‌పింగ్‌లతోపాటు సభ్యదేశాల ఉన్నత స్థాయి అధికార బృందాలు హాజరు కానున్నాయి.
చైనా నుంచి వస్తువుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచడం, చైనా కూడా అందుకు దీటుగా స్పందించడం తెలిసిందే. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు, కెనడా, మెక్సికో నుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కూడా ట్రంప్ సుంకాలను పెంచి అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ కొత్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత బ్రిక్స్ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న ఆయన మంగళవారం ప్రిటోరియాలో రమఫోసాను కలిసి పలు విషయాలను చర్చించారు. చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంపైనే ఈ సమావేశంలో ఎక్కువగా చర్చించే అవకాశం ఉందని రష్యా ఆర్థిక మంత్రి తెలిపారు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుండటాన్ని మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కొన్ని ఆసక్తికర అంశాలు..
♦ బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పదాన్ని 2001లో బ్రిటన్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ తొలిసారి వాడారు.
♦ మొదటి బ్రిక్ సమావేశం రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో 2009లో జరిగింది.
♦ 2010లో ఈ కూటమిలో దక్షిణాఫ్రికా చేరడంతో దీని పేరు బ్రిక్స్‌గా మారింది.
♦ మన దేశంలో బ్రిక్స్ సదస్సులు 2012లో ఢిల్లీలో, 2016లో గోవాలో జరిగాయి.
♦ ప్రపంచంలోని మొత్తం జనాభాలో 40% మంది బ్రిక్స్ దేశాల్లోనే నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment