
అల్లు 'రామాయణం'లో సీత ఎవరు?
పురాణ ఇతిహాసాలు, చరిత్ర ఇతివృత్తాలతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభిస్తోంది.
చెన్నై: పురాణ ఇతిహాసాలు, చరిత్ర ఇతివృత్తాలతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రామాయణ, మహాభారత గాధలతో ఎన్నో కోణాలతో వచ్చిన చిత్రాలు కళాఖండాలుగా నిలిచిపోయాయి. బాలకృష్ణ శ్రీరామరాజ్యం, ఇటీవల బాహుబలి లాంటి పురాణ, చారిత్రక చిత్రాలు నవతరానికి ఎంతో స్పూర్తిగా నిలిచిందనే చెప్పాలి. తాజాగా చారిత్రక ఇతివృత్తంతో సంఘమిత్ర చిత్రం రూపుదిద్దుకుంటోంది.
తాజాగా అలనాటి రామాయణాన్ని అద్భుత కళాఖండంగా తెరకెక్కించడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సిద్దమయ్యారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషలలో నిర్మించనున్నట్లు ఆయన ఇటీవల వెల్లడించారు. ఇందులో శ్రీరాముడు, సీత వంటి ప్రధాన పాత్రలకు ప్రముఖ తారలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా సీత పాత్రకు అనుష్క, తమన్నా, నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.
అనుష్క అరుంధతి, రుద్రమదేవి, దేవసేన పాత్రల్లో ఉత్తమ నటనను ప్రదర్శించింది. ఇక తమన్న బాహుబలి చిత్రంలో అవంతికగా జీవించారనే చెప్పాలి. నటి నయనతార విమర్శకులను సైతం మెప్పించేలా శ్రీరామరాజ్యం చిత్రంలో సీతమ్మగా నటించారు. మరి తాజా రామాయణంలో కలియుగ సీతగా ఎవరు మారతారో మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఎందుకుంటే రామాయణం చిత్రం నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.