‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 1983 నాటి ‘కిసీ సే న కెహనా (ఎవరితో చెప్పొద్దు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. అందులో ‘హనీమూన్’ హోటల్ బోర్డును ‘హనుమాన్’గా మార్చారని హీరోయిన్‌తో అంటాడు హీరో. అలా హనుమాన్‌ను వ్యాపారీకరించడాన్ని దర్శకుడు చూపించారు. ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఈ సినిమా స్క్రీన్ షాట్‌ను చూపి, ‘2014 ముందు హనీమూన్, 2014 తర్వాత హనుమాన్’ అని 4 ఏళ్ల క్రితం ట్వీటారు. ఇది మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. భగవాన్ హనుమాన్‌ను కోతి అని అవమానించారని జుబేర్‌పై అభియోగం.
పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొనబడ్డ స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. ‘కపి’ పదాన్ని కోతి అని అనువదించారు. సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొనబడ్డారు. వీరు వాలం (తోక) గల నరులు. తోకలాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఈ గోచీ పురుషులకు మాత్రమే పరిమితం. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమాదేవి, ఆంజనేయుని తల్లి అంజనీ దేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు.
వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారం చేశారు. రాముడు కూడా యుద్ధంలో వానరులు మానవరూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతిచేష్టలు అంటగట్టి వినోదించారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. హేతుబద్ధ ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలదీ, విజ్ఞులదీ! (క్లిక్: ప్రశ్నించినవారికి నిర్బంధమా?)
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment