
బ్రహ్మహత్య చేసినవాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసినవాడికి, ఏదైనా ఒక వ్రతం చేస్తానని నీళ్ళు ముట్టుకుని సంకల్పించి ఆ వ్రతం చేయనివాడికి కూడా నిష్కృతి ఉందేమో గానీ ఉపకారం పొంది, దానిని స్మరించని వాడు, ఉపకారికి నమస్కరించని వాడు కృతఘ్నుడు. వాడి జీవితానికి మాత్రం నిష్కృతి లేదు.. అంటాడు లక్ష్మణుడు రామాయణంలోని కిష్కింధకాండలో.
అది ఏ సందర్భంలో అని ఉంటాడు..? సీతాన్వేషణలో సాయం చేస్తానని మాట ఇచ్చి, రామబాణంతో తన అన్న వాలిని సంహరింపజేసిన సుగ్రీవుడు, వాలి మరణం తర్వాత కిష్కింధకు పట్టాభిషిక్తుడై, ఆనందోత్సాహాలలో తేలిపోతూ, విందువినోదాలలో మునిగి తేలుతూ, రాముడికిచ్చిన మాటను పక్కన పెడతాడు. అప్పుడు లక్ష్మణుడు ఎంతో కోపంతో, ఆవేదనతో సుగ్రీవుని ఉద్దేశించి పలికిన పలుకులివి. ఇది ఎప్పుడో రామాయణ కాలంలో లక్ష్మణుడు, సుగ్రీవుని ఉద్దేశించిన చెప్పినదే అయినా, ఇప్పటికీ, ఎప్పటికీ వర్తిస్తుంది.
కొందరుంటారు... అవతలి వారి నుంచి ఉపకారం పొందుతారు. వారినుంచి ఆ సాయం అందేవరకు కాళ్లావేళ్లా పడతారు. తమ అవసరం తీరిన తర్వాత ఇక ఆ సంగతి గుర్తుపెట్టుకోరు సరికదా, ఎదురయినా చూడనట్టుంటారు. కనీసం పలకరించరు. అది చాలా తప్పు. ఎదుటివారు చేసిన ఉపకారానికి మనం తగిన ప్రత్యుపకారం చేయలేకపోవచ్చు, కానీ కృతజ్ఞతాభావం లేకపోవడం ఎంతో తప్పు. అలాంటివారికి అంతకు పదింతల అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment