కరుణానిధి (ఫైల్ ఫొటో)
‘ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా మసలుకున్నాం. ఎంజీఆర్ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్ వెంకటరామన్ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు.
- ‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ.
- సంకీర్ణ ప్రభుత్వామనేది తాత్కాలిక ఏర్పాటు. సంకీర్ణం కారణంగా మేం కొన్ని డిమాండ్లు సాధించుకోగలిగాం. తమిళ భాషకు ప్రాచీన ప్రతిపత్తి లభిస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. చివరికి అది కూడా సంకీర్ణం వల్లే సాకారమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు కరుణానిధి.
- కేంద్రంలో తాను కలసిన వ్యక్తుల్లో వీపీ సింగ్‌ను గొప్ప మనిషిగా భావిస్తారు కరుణ. వీపీ చేపట్టిన సామాజిక సంస్కరణలు, రిజర్వేషన్లు, మండల్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు తమ స్నేహానికి వారధి వేశాయంటారు.
- కరుణతో వాజ్‌పేయ్ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి మురసోలి మారన్ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మారన్ కేబినెట్ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు.
రాముడు నాకు శత్రువు కాదు..
వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర. జవహర్‌లాల్ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను. ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. – 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి
కళానిధి
చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి వుండేది కాదని కరుణ తన ఆత్మకథలో రాసుకున్నారు. నాటకం, కవిత్వం, తమిళ సాహిత్యం వైపే ఆయన మనసు మళ్లుతుండేదట.
కరుణ తండ్రి ముత్తువేలు.. చనిపోవడానికి ఒక నెల ముందు కరుణానిధి మాటలు రాసిన‘రాజకుమారి’ సినిమా చూడాలనుకున్నారట. కానీ అప్పటికే ఆయన కంటి చూపుకు దూరమయ్యారు. కనీసం కొడుకు రాసిన మాటలైనా విందామనుకున్నారాయన. దీంతో తిరువారూర్‌లో ఓ థియేటర్‌కు తీసుకుపోయారు. ‘రచయితగా నేను ఎదిగిన తీరును చూసి ఆయన ఎంతో సంబరపడ్డారు’ అని ఆత్మకథలో చెప్పారు కరుణ.
-(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment