టీవీక్షణం: భక్తి రసాత్మకం... ఈ ధారావాహికం!
భక్తి సీరియళ్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ వంటి సీరియల్స్ నిరూపించాయి. యేళ్లపాటు వాటిని ఆదరించి, వీక్షించి తరించారు తెలుగు ప్రేక్షకులు. వాటి సరసన మరోటి చేరింది. అదే... హరహర మహాదేవ.
లయకారుడైన పరమశివుడి గాథ ఇది. లైఫ్ ఓకే చానెల్లో ‘దేవోంకే దేవ్ మహాదేవ్’ పేరుతో ప్రసారమవుతోన్న ఈ సీరియల్‌ను ‘హరహర మహాదేవ’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు మాటీవీ వారు. శివుడిగా మోహిత్ రైనా అద్భుతమైన అభినయం అందరినీ కట్టిపడేస్తోంది. సాక్షాత్తూ పరమ శివుడినే చూస్తున్నట్టుగా ీఫీలయ్యి శివనామ స్మరణలో తరిస్తున్నారు జనం.
పార్వతిగా సోనారిక భదోరియా కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. అందుకే ఈ సీరియల్ హిందీతో పాటు తెలుగులో కూడా విజయవంతంగా సాగిపోతోంది. ఇతర భక్తి సీరియళ్లను తన టీఆర్పీతో అధిగమిస్తోంది. అయినా మహాదేవుణ్నే తీసుకొచ్చి ముంగిట నిలుపుతామంటే ఎవరు మాత్రం కాదంటారు! ఈశ్వరుడి లీలలకు అందమైన చిత్ర రూపమిచ్చి కళ్లకు కడతామంటే ఎవరు చూడనంటారు!
మళ్లీ ఆడేసుకుంటారట!
డ్యాన్స్‌షోలకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకూ వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో అన్ని చానెళ్లవారూ అటువంటి షోలు ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. వాటిలో ఒకటి... ‘ఆట’.
ఓంకార్ నిర్వహించే ఈ డ్యాన్స్‌షో మాంచి సక్సెస్ అయ్యింది. తీవ్ర విమర్శలు ఎదురైనా... షో మాత్రం ఆగకుండా సాగుతోంది. త్వరలోనే మరో సిరీస్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు ఓంకార్. వేసవి సెలవుల్లో మొదలుపెడితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాడట. సుందరం మాస్టారితో పాటు, కొరియోగ్రాఫర్ ప్రేమ్క్ష్రిత్, నటి చార్మిలను న్యాయ నిర్ణేతలుగా తీసుకురావాలని ప్లాన్లు వేస్తున్నాడట. పైగా... ఈసారి కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందట. కొత్తదనం సంగతేమో గానీ మెలోడ్రామాతో కృత్రిమంగా అనిపిస్తుందని ఈ షో మీద సెటైర్లు వేస్తుంటారంతా. ఈసారైనా ఓంకార్ షో స్టయిల్ మార్చి, ఈ సెటైర్లకు సెలవిస్తాడేమో చూడాలి!
‘నాన్న’ రెండోసారీ నచ్చాడు!
హిందీ చానెళ్లలో ప్రతి సీరియల్ ఎపిసోడ్ రోజుకి రెండుమూడుసార్లు వస్తుంది. దాంతో ఒకసారి మిస్ అయినా మరోసారి చూడవచ్చు. కానీ మన తెలుగులో ఆ అవకాశం లేదు. ఒక్కసారి మిస్సయ్యామా... ఇక అంతే సంగతులు! ఎపిసోడే రెండోసారి చూడలేం అని ఫీలయ్యేవాళ్లకు ఏకంగా సీరియల్‌నే రెండోసారి ప్రసారం చేస్తే ఎలా ఉంటుంది? మొదట చూడనివాళ్లు, కొన్ని ఎపిసోడ్లు మిస్ అయినవాళ్లు, చూసి కూడా బాగా నచ్చి మరోసారి చూడాలనుకునేవాళ్లందరికీ అది శుభవార్తే కదా! అందుకే ‘నాన్న’ సీరియల్ రెండోసారి కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.
కొత్తగా పెళ్లయిన ఓ యువకుడి దగ్గరకు నేను నీ కొడుకునంటూ ఓ పిల్లాడు వస్తే... ఆ యువకుడి భార్య మనసులో, వారి కుటుంబంలో చెలరేగే అలజడి ఎలా ఉంటుంది? వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అసలా పిల్లాడు ఎవరు? ఎందుకొచ్చాడు? ఆద్యంతం సస్పెన్స్‌తో సాగే ఈ సీరియల్ అప్పట్లో జెమినీ చానెల్లో ప్రసారమై నంది అవార్డును అందుకుంది. ఇప్పుడు మాటీవీలో మరోసారి ప్రసారమవుతూ ప్రేక్షకులను టెలివిజన్ సెట్లకు కట్టిపడేస్తోంది!