రామాయణం అంటే హిందువులకు సంబంధించిన ఇతిహాసంగా భావిస్తుంటారు.
మంగళూరు: రామాయణం అంటే హిందువులకు సంబంధించిన ఇతిహాసంగా భావిస్తుంటారు. అయితే ఇదే రామాయణం నేపథ్యంతో నిర్వహించిన పరీక్షలో ఓ ముస్లిం బాలిక 93% మార్కులతో మొదటిస్థానంలో నిలిచింది. కర్ణాటక-కేరళ సరిహద్దు ప్రాంతమైన పుత్తురు తాలుకాలో భారత సంస్కృతి ప్రతిష్టాన్ సంస్థ గత ఏడాది నవంబర్‌లో పరీక్ష నిర్వహించగా.. సుళియపడవులోని సర్వోదయ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఫాతిమా రహీలా తాలూకాలోనే మొదటి స్థానంలో నిలిచింది.
నిజానికి రాష్ట్రం లోనే మొదటిస్థానంలో నిలిచేందుకు ఎంతో కష్టపడిందని, అయితే తాలూకాలో మొదటిస్థానం మాత్రమే దక్కిందని ఆమె తండ్రి ఇబ్రహీం తెలిపాడు. చిన్నప్పటి నుంచే భారత సంస్కృతి సంప్రదాయాలంటే ఆసక్తి చూపే ఫాతిమా 9వ తరగతి నుంచి రామాయణ, మహాభారతాలపై పట్టుసాధించిందని ఆమె మామయ్య తెలిపాడు. నిజానికి ఈ పరీక్ష రాయమని ఆమెకు ఎవరూ చెప్పకపోయినా.. వివరాలు సేకరించి, సొంతంగానే ప్రిపేరై, మంచి మార్కులు సాధించిందని పాఠశాల హెడ్‌మాస్టర్ పి. సత్యశంకర్ భట్ తెలిపారు.