భక్త కోటికి తారక మంత్రం.. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక ఈ వేడుక | Srirama Navami 2023: Life Lessons To Learn From Ramayana | Sakshi
Sakshi News home page

భక్త కోటికి తారక మంత్రం.. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక ఈ వేడుక

Published Thu, Mar 30 2023 5:13 PM | Last Updated on Thu, Mar 30 2023 5:33 PM

Srirama Navami 2023: Life Lessons To Learn From Ramayana - Sakshi

శ్రీరామ చంద్రమూర్తి జీవిత కథే రామాయణం. ఆ రామాయణాన్ని అనుసరిస్తే చాలు మనం ఎలా వ్యవహరించాలో అర్ధం అయిపోతుంది. ఎలా ఉండకూడదో ఎలా నడుచుకోకూడదో కూడా తెలిసిపోతుంది. మనకి కర్తవ్య బోధ చేస్తూ దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లే కాంతి బాటే రామాయణం. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ రామనామమే భక్తకోటికి తారక మంత్రంగా ఉండిపోయింది. ఎన్ని యుగాలు దాటినా అదే మంత్రం లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. రామ రాజ్యం రావాలంటే రాముడు చూపిన బాటలో ధర్మాన్ని ఆచరించడమొక్కటే మార్గం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు.

రామరాజ్యం యావత్ ప్రపంచానికే ఆదర్శ రాజ్యం
ఏ రాజ్యం అయితే సుభిక్షంగా ఉంటుందో ప్రజలంతా ఏ చీకూ చింతా లేకుండా  సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారో ఏ రాజ్యంలో అయితే ప్రజలు మానసిక క్షోభలు పడకుండా మనశ్శాంతిగా ఉంటారు ఏ రాజ్యంలో అయితే  ప్రజలు ఆకలి దప్పులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారో  దాన్ని రామరాజ్యం అంటారు. 

ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదే రామరాజ్యం. అందుకే రాముడి పాలనలో అందరూ పిల్లా పాపలతో హాయిగా జీవించారు. వన వాసం పూర్తి చేసుకుని తండ్రి మాటను దక్కించాడు. సత్య నిష్ఠ పాటించాడు. తిరిగి అయోధ్య చేరి రాజ్యాధికారం చేపట్టాడు. పాలకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్న సూత్రాన్ని  రాముడు పాటించాడు. తన రాజ్యంలో ఓ మామూలు మనిషి తన సతీమణి సీత గురించి చేసిన వ్యాఖ్యలకు కూడా గౌరవం ఇచ్చాడు.

సీత గురించి తనకు తెలిసినా  ప్రజల నుండి ఓ విమర్శ వచ్చినపుడు పాలకుడిగా తాను జవాబుదారుగా ఉండాలనుకున్నాడు రాముడు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతోన్నా.. కడలి అంతటి దుఖాన్ని దిగమింగుకుని సీతను అడవుల్లో వదిలి రావల్సిందిగా తమ్ముడు లక్ష్మణుణ్నే ఆదేశించాడు రాముడు. అందులో ఓ మంచి పాలకుడు ఎలా వ్యవహరించాలన్న నీతి ఉంది. అది పాలకులందరికీ ఆదర్శమే అంటారు మేధావులు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని ప్రజల మాటలు పట్టించుకోకుండా ఉంటే అది ధర్మ బద్ధమైన పాలన అనిపించుకోదని రాముడు అనుకున్నాడు కాబట్టే సీతను  అడవులకు పంపాడు.

సీతారాముల జీవన యానమే రామాయణం. అది పరమ పవిత్రం. తర తరాలకూ ఆదర్శనీయం. అందుకే అది నిత్య పారాయణ గ్రంధం కూడా. రామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు తెలీని ఆనందం ఆవహించేస్తుంది. ఒక్క సారి చదివితే మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉంటుంది.  చదువుతున్న కొద్దీ కొత్తగానే ఉంటుంది. అదే సమయంలో మధురంగా అమృతంలా ఉంటుంది. అందుకే యుగాల తరబడి రామాయణం కల్పవృక్షంలా వెలుగుతూనే ఉంది. శ్రీరామ నవమి అంటే లోకానికి పండగ. జనులందరికీ పండగ. సీతారాముల కళ్యాణం అంటే అదో  వేడుక.  తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement