బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మన మధ్య లేకున్నా..తన మంచితనంతో అందరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి. భావితరాలకు స్ఫూర్తి. వ్యాపారా సామ్రాజ్యంలో పారిశ్రామిక వేత్తలకు గురువు. వ్యక్తిత్వ పరంగా విద్యార్థులకు, యువతకు ఆదర్శం ఆయన. అలాంటి వ్యక్తి నుంచి ప్రతి చిన్నారి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలెంటో చూద్దామా..!
నిరాడంబరత..
టాటా గ్రూప్‌నే కాకుండా మన దేశం స్వరూపాన్నే తీర్చిదిద్దిన.. ఆ మహనీయుడి జీవన విధానం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన అంత పెద్ద వ్యాపార దిగ్గజమే అయినా సాధారణ జీవన విధానాన్నే ఇష్టపడతారట. అందుకు ఉదాహరణ ఈ కథ..
ఒకరోజు ఎల్‌ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!
సమస్యలను స్వీకరించే గుణం..
రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్‌లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్‌నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్‌ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు.
అల్లరిమూకలతో టాటా మోట్సార్‌లో దాడులకు తెగపడ్డాడు. ఆఖరికి ప్లాంట్‌లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేశాడు. అయినా రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. దీంతో గ్యాంగ్‌స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. అయితే కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్‌లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.
నైతిక విలువలు..
టాటా వ్యాపారంలో నైతిక విలువలకు పెద్దపీట వేశారు. కష్టమైన వ్యాపార నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీ విషయంలో రాజీ పడేందుకు నిరాకరించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కఠిన పరిస్థితులు ఎదురైన మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకుండా వ్యవహరించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఇది విశ్వసనీయతకు నిదర్శనం. అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది అనేందుకు టాటానే నిదర్శనం.
దానగుణం..
ముఖ్యంగా టాటా ట్రస్ట్‌ల ద్వారా చేసిన రతన్ టాటా దాతృత్వ ప్రయత్నాలు.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే అతని నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అతను ఆరోగ్య సంరక్షణ, విద్య , సామాజిక కారణాలపై అధికంగా పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ ఒక వ్యక్తి విజయం అనేది వ్యక్తిగత లాభం మాత్రమే కాదని, దాంతో ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చని.. తన ఆచరణతో చూపించారు.
పట్టుదల..
టాటా తన పదవీ కాలంలో ఆర్థిక మాంద్యం నుంచి వ్యాపార వైఫల్యాల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎక్కడ పట్టు సడలించక.. విజయం దక్కేవరకు పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడి ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఎదురు దెబ్బలనేవి జీవితంలో భాగమని, వాటికే కుదేలవ్వకూడదని చాటిచెప్పారు.
ఇన్నోవేషన్, విజన్
ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు అయిన టాటా నానో లాంచ్ వంటి వినూత్న ఆలోచనలకు రతన్ టాటా పేరుగాంచారు. మధ్యతరగతి భారతీయులు కూడా కారు కొనుక్కో గలిగేలా చేయడమే ఈ కారు లక్ష్యం. ఇక్కడ టాటా ఫార్వర్డ్-థింకింగ్, రిస్క్ తీసుకేనే ధైర్యం మనకు కనిపిస్తున్నాయి. అవసరమనుకుంటే రిస్క్ తీసుకోవాలి.
ఒకవేళ ఫెయిలైన ఒక మంచి అనుభవం లభించడమే గాక సృజనాత్మకంగా ఆలోచించేందకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే అందులో ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లే సామార్థ్యం పెరుగుతుంది.
చివరి వరకు ఆయన జీవితాన్ని చాలా అపరూపంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాదు మరణం సమీపించే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేవారని సన్నిహిత వర్గాల సమాచారం. కెరీర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా మమేకం చేసుకోవాలో ఆచరించి చూపిన వ్యక్తి.
వయసు అనేది శరీరానికే గానీ మనసుకు గాదు అంటూ ఆరు పదుల వయసులోనూ యువకుడిలా చురుకుగా పనిచేస్తూ యువతకు, ఎందరో వ్యాపారా దిగ్గజాలకు స్ఫూర్తిగా నిలిచారు. పైగా ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బతికే ఉండటం అంటే ఏంటో చేసి చూపించారు టాటా.
(చదవండి: రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment