గుణం.. శీలం... స్నేహం
ఆత్మీయం
రామాయణం కేవలం కథ కాదు... అందులోని విషయాలు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. రామరావణ సంగ్రామ సమయంలో విభీషణుడు రాముని శరణుకోరి వచ్చినప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని నమ్మవద్దని, ఇక్కడికి కేవలం గూఢచారిగానే వచ్చాడని అంటాడు రాముడితో. కాని విభీషణుడు వచ్చి పలికిన పలుకులు విన్న తరవాత లక్ష్మణుడు తన తప్పు తెలుసుకుంటాడు. తొందరపాటు వద్దనీ, ఇతరులను అనవసరంగా నిందించవద్దనీ హితవు పలుకుతాడు రాముడు. అంతేకాదు, రాముడు ఎందరితోనో స్నేహం చేశాడు.
వానర రాజయిన సుగ్రీవునితో, పడవలు నడుపుకుంటూ, చేపలు పడుతూ కాలక్షేపం చేసే గుహునితో, శత్రురాజయిన రావణుని తమ్ముడు విభీషణునితో, హనుమతో, నిషాద రాజుతో... ఇలా ఒకరనేమిటి... ప్రతివారితోటీ రామునికి గల మైత్రీ బంధం ఆచరణీయం. శబరి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమె యోగశక్తికి శ్రీరాముడు ఆనందపడిన ఘట్టం చూసినా రాముడు గుణానికిచ్చిన ప్రాధాన్యత బోధపడుతుంది. గుణం, శీలం ఉన్నవారిని ఉన్నతంగా చూడగలగడమే రాముని లక్షణం.
ఇటువంటి విషయాలను గ్రహించగల వివేకం అందరికీ ఉండాలని రామాయణం చెబుతోంది. ఇలా మన నిత్యజీవితంలో ఆదర్శంగా నడవడానికీ లోక కల్యాణానికి వినియోగపడే రీతిలో బతకడానికి అవసరమయిన అనేకానేక ధర్మసూక్ష్మాలు, నీతివాక్యాలూ రామాయణ సాగరంలో దొరికే ముత్యాలు.